ఉద్యాన పంటలు పెంచుతాం
ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేశాం
మామిడి, బత్తాయి, జామ, సీతాఫలం,
యాపిల్ బేర్ పండ్ల మొక్కలు సాగుచేసే రైతులకు సబ్సిడీ ఇస్తున్నాం
160 ఎకరాల్లో పాలీహౌస్‌ల నిర్మాణానికి అనుమతులు
పట్టు పరిశ్రమ శాఖ కార్యక్రమాలు విస్తృతం చేస్తాం
ఉద్యానవన శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సోమేశ్వర్రావు
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు పొరుగునే ఉన్న సంగారెడ్డి జిల్లాలో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెంచడం లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తామని.. జిల్లా ఉద్యానవన శాఖ ఏడీ సోమేశ్వర్రావు వెల్లడించారు. పందిరి కూరగాయల సాగుకు ప్రభుత్వ పరంగా సబ్సిడీ ఇస్తున్నామన్నారు. పాలీహౌస్‌ల ఏర్పాటుకు రైతులు ముందుకు వస్తున్నారన్నారు. ఇటీవల తమశాఖలో విలీనమైన పట్టు పరిశ్రమ శాఖ కార్యక్రమాలను విస్తృతం చేస్తామని సోమేశ్వర్రావు తెలిపారు. తమ శాఖ ఆధ్వర్యంలో చేపట్టనున్న కార్యక్రమాలను ఆయన గురువారం ‘సాక్షి’కి వివరించారు.
సాక్షి, సంగారెడ్డి :
సాక్షి : జిల్లాలో బిందు సేద్యానికి ప్రభుత్వ పరంగా ఎలాంటి మద్దతు ఇస్తున్నారు?
అధికారి : జిల్లాలో ఈ ఏడాది 2800 హెక్టార్లలో బిందుసేద్యం పరికరాలను అమర్చడం లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. అయితే పదివేల హెక్టార్లలో ఏర్పాటు చేయాలంటూ రైతుల నుంచి డిమాండ్ ఉండటంతో దరఖాస్తులు తీసుకున్నాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అదనంగా కనీసం ఐదువేల హెక్టార్లలో ఏర్పాటుకు అనుమతి ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరాం.
సాక్షి : ఉద్యాన పంటల సాగు పరిస్థితి ఎలా ఉంది?
అధికారి : స్టేట్ హార్టీకల్చర్ మిష¯ŒS కింద ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెంచే యోచనలో ఉన్నాం. మామిడి, బత్తాయి, జామ, సీతాఫలం, యాపిల్ బేర్ తదితర పండ్ల మొక్కల సాగుచేసే రైతులకు సబ్సిడీ ఇస్తున్నాం. పందిరి కూరగాయలు సాగుకు కూడా ఎకరాకు లక్ష రూపాయల చొప్పున సబ్సిడీ ఇస్తున్నాం. కడీలు, వైర్ తదితరాల ఏర్పాటుకు ఈ మొత్తాన్ని వెచ్చించాల్సి వుంటుంది.
సాక్షి : పాలీహౌస్‌లకు ప్రభుత్వ పరంగా ఎలాంటి ప్రోత్సాహం ఇస్తున్నారు?
అధికారి :జిల్లాల్లో 160 ఎకరాల్లో పాలీహౌస్‌ల నిర్మాణానికి మంజూరు లభించింది. ఒక్కో యూనిట్ విలువ రూ.33.70లక్షలు. ఇందులో 25.30లక్షలు సబ్సిడీ రూపంలో ఇస్తున్నాం. మిగతా మొత్తాన్ని లబ్ధిదారుడు భరించాల్సి ఉంటుంది. 2014–15లో 30 ఎకరాలు, 2015–16లో 50 ఎకరాలు 90శాతం సబ్సిడీపై ఇచ్చాం. 2016–17కు సంబంధించి ఇంకా బడ్జెట్ విడుదల కావాల్సి ఉంది.
సాక్షి : పట్టు పరిశ్రమ శాఖను ఉద్యానశాఖలో విలీనం చేశారు కదా. పనితీరు ఎలా ఉంది?
అధికారి :ఇటీవల పట్టు పరిశ్రమ శాఖ (సెరికల్చర్) విభాగాన్ని ఉద్యానవన విభాగంలో విలీనం చేశారు. ప్రస్తుతం ఆ విభాగానికి చెందిన సిబ్బంది మా పరిధిలోనే పనిచేయాల్సి ఉంటుంది. జిల్లాలో సెరికల్చర్ కార్యక్రమాలు పెద్దగా అమలు కావడం లేదు. సంగారెడ్డి శివారులో ఉన్న చాల్కి సెంటర్ ద్వారా ఇతర ప్రాంతాల నుంచి కేవలం పట్టుగుడ్లు తెచ్చి స్థానికంగా సరఫరా చేయడానికే పరిమితమైంది. పట్టు పరిశ్రమ కార్యకలాపాలను విస్తరించేందుకు ప్రయత్నిస్తాం.