నామ్‌కే వాస్తేగా హౌస్ కమిటీలు!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ఏర్పాటైన శాసనసభాసంఘాలు (హౌస్ కమిటీలు) నామమాత్రంగా మారాయన్న విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ భూసంబంధ వ్యవహారాల్లో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలను వెలుగులోకి తెచ్చేందుకు జనవరిలో మూడు హౌస్ కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రభుత్వ భూముల కబ్జా, అక్రమ విక్రయాలు, కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలు, వక్ఫ్ భూముల అన్యాక్రాంతం తదితర అంశాల్లో పూర్తి స్థాయి విచారణ జరిపి ఈ కమిటీలు అసెంబ్లీకి నివేదికలు సమర్పించాల్సి ఉంది.
మూడు నెలల కాలపరిమితితో ఏర్పాటైన ఈ కమిటీలు ఇప్పటి వరకూ ఒక్కోసారి మాత్రమే భేటీ అయ్యాయి. మేడ్చెల్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి చైర్మన్‌గా ఏర్పాైటైన కమిటీ ప్రభుత్వ, దేవాదాయ, భూదాన్, సీలింగ్ మిగులు, ఇనాం భూములు ఏమేర అన్యాక్రాంతమయ్యాయో లెక్క తేల్చాల్సి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 1.90 లక్షల ఎకరాల అసైన్డు భూములు కబ్జాకు గురైనట్లు ప్రాథమికంగా ఓ నిర్ధారణకు వచ్చింది.
జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో అక్రమాలపై వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ చైర్మన్‌గా కమిటీ ఏర్పాటైంది. దీనిపై ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. అన్యాక్రాంతమైన వక్ఫ్ భూములపై నిగ్గుతేల్చేందుకు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ చైర్మన్‌గా ఏర్పాటైన కమిటీ కూడా నామమాత్రంగానే మిగిలింది.