రోడ్డు ప్రమాదంలో హౌసింగ్ వర్క్ ఇన్స్పెక్టర్ దుర్మరణం
మైదుకూరు టౌన్ : మైదుకూరు మండల పరిధిలోని తువ్వపల్లె మూడుమాళ్ల వద్ద బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మైదుకూరు హౌసింగ్ వర్క్ ఇన్స్పెక్టర్ ఆకుల చంద్రశేఖర్(46) మృతి చెందారు. వివరాలిలా ఉన్నాయి. చంద్రశేఖర్ బుధవారం స్థానిక బద్వేలు రోడ్డులో కొత్తగా నిర్మిస్తున్న ఇళ్లను పరిశీలించి వాటిని ఆన్లైన్లో జియోటాగింగ్ చేశారు. సాయంత్రం నుంచి రాత్రి వరకు తన కార్యాలయంలో విధులు నిర్వర్తించి తాను నివాసముంటున్న బద్వేలుకు ద్విచక్రవాహనంలో బయలు దేరాడు. మార్గ మధ్యంలో శుభకార్యానికి హాజరై బద్వేలుకు వెళుతుండగా అర్ధరాత్రి 12.45 గంటల సమయంలో తువ్వపల్లె కూడలి వద్దకు రాగానే ముందు వెళుతున్న లారీని వెనుక భాగంలో ఢీ కొనడంతో చంద్రశేఖర్ అక్కడికక్కడే మృతి చెందారు ద్విచక్రవాహనం లారీ వెనుక టైరులో ఇరుక్కొని దాదాపు కిలోమీటర్ వరకు రోడ్డు వెంబడి ఈడ్చుకెళ్లింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అర్బన్ సీఐ వెంకటేశ్వర్లు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. సంఘటన స్థలంలో ఎలాంటి వాహనం లేదు. దీంతో సీఐ ఆ దారి వెంబడి గాలించగా ఖాజీపేటకు వెళ్లే మార్గంలో లారీ నిలబడి ఉండటాన్ని గమనించి లారీని పోలీసు స్టేషన్‌కు తరలించారు. చంద్రశేఖర్ వాడుతున్న మొబైల్, డైరీ ప్రమాద స్థలంలో లభించాయి. వాటి ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అర్బన్ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. మృతుడు చంద్రశేఖర్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. హౌసింగ్ వర్క్ ఇన్స్పెక్టర్ మృతితో మండలంలో తీవ్ర విషాదం నెలకొంది.