చేతికందేనా!
పింఛన్ల కోసం 1.60లక్షల మంది ఎదురుచూపులు
ఇప్పటి వరకు 1.11లక్షల మందికే అందిన వైనం
జన్మభూమిలోనే అందిస్తామని అధికారుల ప్రకటన
వాయిదా పడితే తమ పరిస్థితి ఏమిటని లబ్ధిదారుల్లో ఆందోళన
మచిలీపట్నం/గుడ్లవల్లేరు : హుదూద్ తుపాను ఉత్తరాంధ్రను కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. ఈ పెను తుపాను పరోక్షంగా మన జిల్లాలోని 1.60లక్షల మందికి పైగా సామాజిక పెన్షనర్ల పైనా తీవ్ర ప్రభావమే చూపింది. ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోవడంతో పెంచిన పింఛనుతో ‘పండగ’ చేసుకుందామని ఆశించిన వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఈ దీపావళి రోజు చీకటే మిగిలింది.
అక్టోబర్ రెండో తేదీ నుంచి ప్రభుత్వం వృద్ధులు, వితంతువులకు నెలకు రూ.1,000, వికలాంగులకు రూ.1,500 చొప్పున అందిస్తామని ప్రకటించింది. ఈ మొత్తాన్ని జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో అందజేస్తామని చెప్పారు. ఇందుకు సంబంధించి తొలుత అనర్హులను తొలగించేందుకు సర్వే నిర్వహించారు. అనంతరం జన్మభూమి కార్యక్రమంలో కొందరికి పింఛన్లు పంపిణీ చేశారు. ఈ క్రమంలో హుదూద్ తుపాను సంభవించడంతో జన్మభూమిని వాయిదా వేశారు. దీంతో పింఛన్ల పంపిణీకి బ్రేక్ పడింది.
అంతా తికమకే..
జిల్లా వ్యాప్తంగా 3.13 లక్షల మంది వివిధ రకాల పింఛన్లు పొందుతున్నారు. ఇటీవల ఏర్పాటుచేసిన కమిటీలు సర్వే నిర్వహించి 14,370 మంది అనర్హులని గుర్తించారు. మరో 21వేల మందికిపైగా పింఛనుదారులకు ఆధార్ అనుసంధానం పూర్తి కాలేదని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం వారికి పింఛన్లు నిలిపివేశామని, పూర్తి పరిశీలన అనంతరం నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
మిగిలిన 2.77 లక్షల మందికి పింఛన్లు ఇస్తామని ప్రకటించారు. ఇప్పటి వరకు జరిగిన జన్మభూమి కార్యక్రమాల్లో 1.11 లక్షల మందికి పింఛన్లు అందజేసినట్లు డీఆర్డీఏ అధికారులు తెలిపారు. మిగిలినవారికి ఈ నెల 25 నుంచి జరిగే జన్మభూమి కార్యక్రమంలో ఇస్తామని చెబుతున్నారు. అయితే, పింఛన్ల పంపిణీకి జన్మభూమితో లింకు పెట్టి నెలాఖరు వరకు అందజేయకపోవడంతో మందుబిళ్లలు కూడా కొనుగోలు చేసేందుకు డబ్బుల్లేక ఇబ్బందులు పడుతున్నామని వృద్ధులు వాపోతున్నారు.
పింఛన్లు నిలిపేయటం అన్యాయం
హుదూద్ తుపాను వల్ల జన్మభూమి కార్యక్రమాన్ని వాయిదా వేయటంలో అర్థం ఉంది. కానీ, లబ్ధిదారులకు ప్రభుత్వం పింఛన్లను నిలిపేయటం అన్యాయం. వృద్ధులు, వికలాంగులకు వెంటనే పింఛన్లు పంపిణీ చేయాలి.
- కాటే నాగజ్యోతి, ఎంపీటీసీ సభ్యురాలు, వేమవరం, గుడ్లవల్లేరు మండలం