ఇంటర్ ఫస్టియర్‌లో పెరిగిన ఉత్తీర్ణత
జనరల్‌లో జిల్లాకు 10వ స్థానం, ఒకేషనల్ ఉత్తీర్ణతలో మొదటిస్థానం జనరల్ 57%, ఒకేషనల్70% ఉత్తీర్ణత
అత్యధిక మార్కులు వచ్చిన వారిలో టాప్ - 20లో రోషిణి
విజయనగరం అర్బన్:
ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సర వార్షిక పరీక్షల ఫలితాల్లో జిల్లా మెరుగుపడింది. 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాకు 10వ స్థానం లభిం చింది. ఉత్తీర్ణత విషయంలో 5 శాతం పెరిగిం ది. గత ఏడాది ఉత్తీర్ణత 52 శాతం కాగా తాజాగా 57 శాతానికి పెరిగింది. ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షల ఫలితాలను విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం సాయంత్రం 5గంటలకు విడుదల చేశారు. జిల్లాలో పరీక్షలు రాసిన 20,936 మంది విద్యార్థుల్లో 57 శాతంతో 12,019 మంది ఉత్తీర్ణలయ్యారు. ఫలితాల్లో ఈ సారి కూడా బాలికలే తమ హవాను చాటుకున్నారు. పరీక్షకు హాజరైన 11,100 మంది బాలికల్లో 61 శాతంతో 6,795 మంది ఉత్తీర్ణులయ్యారు. అదే బాలురులో 9,836 మందిలో 53 శాతంతో 5,224 మంది ఉత్తీర్ణులయ్యారు.వొకేషనల్ ఫలితాల్లో మొదటి స్థానం.. వృత్తికోర్సుల ఉత్తీర్ణతలో రాష్ట్రస్థాయిలో జిల్లాకు ప్రథమ స్థానం లభించింది. ఈ పరీక్షలకు 1914 మంది హాజరుకాగా 70 శాతంతో 1,346 మంది ఉత్తీర్ణులయ్యారు. జిల్లాలోని 22 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 62 శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో జిల్లా నిలిచింది. ప్రభుత్వ కళాశాలలకు చెందిన 3,331 మంది పరీక్ష రాయగా 2,063 మంది ఉత్తీర్ణులయ్యారు.
అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు వీరే
ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సర వార్షిక పరీక్షల్లో తాజాగా అందిన సమాచారం మేరకు గ్రూప్‌ల వారీగా అత్యధిక మార్కులు సాధించిన వారి వివరాలు ఇలా ఉన్నాయి. ఎంపీసీలో అత్యధికంగా 466/470 మార్కులతో వి.రోషిణి, రెండవ అత్యధికం 465/470 మార్కులు ఊహాప్రియకి, 464/470 మార్కులు బి.చైతన్యలక్ష్మి, జీవీఎస్జీహేమంత్, సాయిఅనుదీప్, సుధాసారికలకు లభించాయి. అదే విధంగా బైపీసీ గ్రూప్‌లో 433/440 మార్కులతో వి.దినేష్, 432/440 మార్కులతో టి.సాయిగీతిక, బోని రాధిక, పూజాబజాజ్లు అత్యధిక మార్కులు సాధించిన వారిలో ఉన్నారు.వీరంతా స్థానిక చైతన్య, నారాయణ కళాశాలలకు చెందినవారు. కామ ర్స్‌లో స్థానిక ఆర్ఎస్ అకాడమీ విద్యార్థి 480/500 మార్కులతో కె.నాగలక్ష్మి అధికమార్కులు సాధించినవారిలో ఉంది.
మెరిసిన రోషిణి: జిల్లాలో ఎంపీసీలో అత్యధిక మా ర్కులు సాధించిన రోషిణి రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక మార్కులు సాధించిన వారిలో టాప్-20లో నిలిచింది.