india tennis star
-
క్వార్టర్స్‌లో సానియా జోడి
రోమ్ మాస్టర్స్ టోర్నీ రోమ్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా-కారా బ్లాక్ (జింబాబ్వే) జోడి రోమ్ మాస్టర్స్ డబ్ల్యూటీఏ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన మహిళల డబుల్స్ రెండో రౌండ్లో ఆరో సీడ్ భారత్-జింబాబ్వే జంట 6-3, 6-4తో డానియెల్ హంతుచొవ-మిర్జానా ల్యూసిక్ బెరోని జంటను కంగుతినిపించింది. ఇక్కడే జరుగుతున్న రోమ్ మాస్టర్స్ ఏటీపీ టోర్నమెంట్లో భారత సీనియర్ డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న-ఐజాముల్ హక్ ఖురేషీ (పాకిస్థాన్) జోడి నిష్ర్కమించింది. రెండో రౌండ్లో అమెరికాకు చెందిన కవల సోదరులు మైక్- బాబ్ బ్రయాన్ జోడి చేతిలో పరాజయం చవిచూసింది. అన్‌సీడెడ్ ఇండో-పాక్ జంట 5-7, 1-6తో టాప్ సీడ్ అమెరికా ద్వయం చేతిలో ఓడి ఇంటిదారి పట్టింది. గంటా ఐదు నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో బోపన్న-ఖురేషీ జోడి ఒక సారి ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేయగలిగింది. -
సోమ్‌దేవ్ సంచలనం
ఐదో ర్యాంకర్ డెల్‌పొట్రోపై విజయం దుబాయ్ ఓపెన్ దుబాయ్: భారత టెన్నిస్ స్టార్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ తన కెరీర్లోనే చిరస్మరణీయ విజయం సాధించాడు. తొలిసారి ప్రపంచ టాప్-5 ర్యాంకింగ్స్‌లో ఉన్న క్రీడాకారుడిపై గెలిచాడు. దుబాయ్ ఓపెన్ టోర్నీ తొలి రౌండ్లో ప్రపంచ 78వ ర్యాంకర్ సోమ్‌దేవ్ 7-6 (7/3)తో ప్రపంచ ఐదో ర్యాంకర్, రెండో సీడ్, యూఎస్ ఓపెన్ మాజీ చాంపియన్ యువాన్ మార్టిన్ డెల్‌పొట్రో (అర్జెంటీనా)పై గెలిచాడు. తొలి సెట్‌ను కోల్పోయాక గాయం కారణంగా డెల్‌పొట్రో వైదొలగడంతో సోమ్‌దేవ్‌ను విజేతగా ప్రకటించారు. 67 నిమిషాలపాటు జరిగిన తొలి సెట్లో సోమ్‌దేవ్ ఐదు ఏస్‌లు సంధించాడు. ఇద్దరూ ఒక్కోసారి తమ సర్వీస్‌ను కోల్పోయారు. అయితే స్కోరు 5-6తో ఉన్నదశలో సోమ్‌దేవ్ తన సర్వీస్‌లో 0-40తో వెనుకబడ్డా తేరుకొని మూడు సెట్ పాయింట్లు కాపాడుకున్నాడు. సర్వీస్‌ను నిలబెట్టుకొని స్కోరును సమం చేశాడు. టైబ్రేక్‌లో పైచేయి సాధించి తొలి సెట్‌ను నెగ్గాడు. క్వార్టర్స్‌లో బోపన్న జంట పురుషుల డబుల్స్‌లో బోపన్న (భారత్)- ఖురేషీ (పాకిస్థాన్) జోడి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. తొలి రౌండ్లో ఈ ఇండో-పాక్ ద్వయం 6-1, 5-7, 10-8తో డెవిడెంకో (రష్యా)- హనెస్కూ (రుమేనియా) పై నెగ్గింది. -
సానియాకు 18వ డబుల్స్ టైటిల్
టోక్యో : సింగిల్స్ విభాగంలో కెరీర్ దాదాపు ముగిసినా... డబుల్స్‌లో మాత్రం భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా నిలకడగా రాణిస్తోంది. జింబాబ్వే క్రీడాకారిణి కారా బ్లాక్‌తో కలిసి ఈ హైదరాబాద్ అమ్మాయి పాన్ పసిఫిక్ ఓపెన్‌లో డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. శనివారం ముగిసిన ఈ టోర్నమెంట్ ఫైనల్లో అన్‌సీడెడ్ సానియా మీర్జా-కారా బ్లాక్ ద్వయం 4-6, 6-0, 11-9తో హావో చింగ్ చాన్ (చైనీస్ తైపీ)-లీజెల్ హుబెర్ (అమెరికా) జంటను ఓడించింది. ఈ ఏడాది సానియాకిది నాలుగో డబుల్స్ టైటిల్ కాగా... కెరీర్లో 18వ టైటిల్ కావడం విశేషం. 85 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా జంట నాలుగు ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. సానియా జోడికి లక్షా 22 వేల డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 76 లక్షల 24 వేలు)తోపాటు 900 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.