సందిగ్ధంలో భారత్-జింబాబ్వే సిరీస్!
ప్రసారకర్తలతో వివాదమే కారణం
హరారే: వచ్చే నెలలో జింబాబ్వేలో జరగాల్సిన భారత క్రికెట్ జట్టు పర్యటన వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ టూర్లో భాగంగా భారత్ 3 వన్డేలు, రెండు టి20 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఈ సిరీస్ నిర్వహణపై సందేహం నెలకొందని, ఇప్పుడు కాకపోతే ఏడాది తర్వాతే ఇది సాధ్యమవుతుందని జింబాబ్వే క్రికెట్ బోర్డు (జెడ్సీ) ప్రకటించింది. జింబాబ్వేలోని మ్యాచ్‌లకు అధికారిక ప్రసారకర్త అయిన టెన్ స్పోర్ట్స్, బీసీసీఐ మధ్య ఉన్న వివాదమే దీనికి కారణమని తెలుస్తోంది.
గతంలో కొన్ని సమస్యల కారణంగా టెన్ స్పోర్ట్స్ ఈ సిరీస్‌ను ప్రసారం చేయకూడదని భావిస్తోంది. దాంతో జెడ్సీ అటు టెన్‌స్పోర్ట్స్, ఇటు బీసీసీఐతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించే పనిలో పడింది. సోమవారం నుంచి బార్బడోస్‌లో జరిగే ఐసీసీ వార్షిక సమావేశం సందర్భంగా బీసీసీఐ పెద్దలతో మాట్లాడాలని జెడ్సీ చైర్మన్ విల్సన్ మనసే నిర్ణయించారు. ‘సాధ్యమైనంత త్వరగా దీనికి పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నాం. అది జరగకపోతే ఇదే టూర్‌ను వచ్చే ఏడాది నిర్వహించే విధంగా బీసీసీఐతో చర్చిస్తాం’ అని మనసే వెల్లడించారు. బంగ్లాదేశ్ పర్యటన తర్వాత జూలైలో జింబాబ్వేలో భారత్ పర్యటించాల్సి ఉంది.