పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు బాధ్యత ఏడీబీదే
హైదరాబాద్: చెన్నై-వైజాగ్ పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు బాధ్యత ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ)కి అప్పగిస్తూ భారత ప్రభుత్వంలోని పరిశ్రమల విభాగం నిర్ణయం తీసుకుంది. దీంతో వెయ్యి కిలోమీటర్లకు పైగా ఉన్న ఈ కారిడార్ ఏర్పాటుకు అవసరమైన నిధుల్ని ఏడీబీయే సమకూర్చనుంది. ఈ మేరకు ఏడీబీ ప్రతినిధి బృందం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో శుక్రవారం లేక్‌వ్యూ అతిథి గృహంలో భేటీ అయ్యారు.
ప్రాథమికంగా కారిడార్ ఏర్పాటుకు కావాల్సిన అంశాలపై సీఎం చంద్రబాబుకు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. మౌలిక వసతుల కల్పనలో భాగంగా పోర్టులు, ఎయిర్‌పోర్టులు, రైల్వే లైన్లు, రహదారుల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వమే ముందుకు రావాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఆగస్టు 10న మరోసారి ఏడీబీ బృందం సీఎంతో భేటీ కానుంది. అప్పటికల్లా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓ నివేదికను సిద్ధం చేసేలా నిర్ణయించారు.