అంతర్జాతీయ స్థాయిలో 'వీరప్పన్' సినిమా: వర్మ
తాజా సినిమా 'కిల్లింగ్ వీరప్పన్'తో మరోసారి తన సత్తా చాటుకున్న దర్శకుడు రాంగోపాల్ వర్మ.. ఈ చిత్రాన్ని యథాతథంగా హిందీలో విడుదల చేయబోనని ప్రకటించాడు. ఇందుకు బదులుగా మొదట గంధపు చెక్కల స్మగ్లర్ 'వీరప్పన్' జీవితకథను సినిమాగా తీసి.. దీనిని హిందీలోనూ, ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తానని ట్విట్టర్లో తెలిపారు. ఆ తర్వాత 'కిల్లింగ్ వీరప్పన్' సినిమాను విడుదల చేస్తానని ప్రకటించారు. 'వీరప్పన్' జీవిత కథను అంతర్జాతీయ సినిమాగా తెరకెక్కించేందుకు దుబాయ్‌కి చెందిన ఓ వ్యాపారవేత్త, అతని పార్ట్నర్ ముందుకొచ్చారని వర్మ చెప్పారు.
'కిల్లింగ్ వీరప్పన్' సినిమా కన్నడంలో సూపర్‌హిట్ అయినప్పటికీ.. దానిని యథాతథంగా ఉత్తర భారత ప్రేక్షకులకు, ప్రపంచవ్యాప్త సినీ ప్రియులకు అందించబోనని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో కరుడుగట్టిన నేరగాడైన వీరప్పన్ గురించి దక్షిణాది ప్రేక్షకులకు తెలుసు కనుక.. అతని ఆత్మకథను తెలియజేయకుండానే అతడు ఎలా చనిపోయాడనేది 'కిల్లింగ్ వీరప్పన్'లో చూపించామని, అయితే ఉత్తరాది వారికి, ప్రపంచవ్యాప్త ప్రేక్షకులకు వీరప్పన్ గురించి తెలియకపోవడంతో 'కిల్లింగ్ వీరప్పన్'కు వారికి అర్థం కాకపోవచ్చునని, అందుకే మొదట 'వీరప్పన్' ఆత్మకథను సినిమాగా తెరకెక్కిస్తానని, 'కిల్లింగ్ వీరప్పన్'లోని వారు కాకుండా ఈ సినిమాలో పూర్తిగా వేరే నటీనటులు ఉంటారని చెప్పారు. ఆ తర్వాత వీరప్పన్‌ను ఎలా చంపారనేది సినిమాగా చూపిస్తామని వర్మ క్లారిటీ ఇచ్చారు.