మూడో రోజూ నష్టాలే..
ఫెడ్ ఫలితంపైనే అందరి దృష్టి
* 214పాయింట్లు నష్టంతో 27,040కు సెన్సెక్స్
* 62 పాయింట్ల నష్టంతో 8,171కు నిఫ్టీ
అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశం నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ చేయడంతో భారత స్టాక్ మార్కెట్ బుధవారం నష్టాల్లో ముగిసింది. ఎలాంటి సానుకూల సంకేతాలు లేకపోవడంతో ఇన్వెస్టర్ల వేచి చూసే ధోరణి కారణంగా స్టాక్ మార్కెట్ వరుసగా మూడో రోజూ నష్టాల్లోనే ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్ 214 పాయింట్లు నష్టపోయి 27,040 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 62 పాయింట్లు నష్టపోయి 8,171 పాయింట్ల వద్ద ముగిశాయి.
నిఫ్టీ 8,200 పాయింట్ల దిగువన ముగియగా, ఇంట్రాడేలో సెన్సెక్స్ 27,000 పాయింట్ల దిగువకు పతనమైంది. అక్టోబర్ సిరీస్ డెరివేటివ్‌ల కాంట్రాక్టులు నేటితో ముగియడం, సెప్టెంబర్ క్వార్టర్ ఫలితాలు అంతంతమాత్రంగానే ఉండడం, బీహార్ ఎన్నికలు, రూపాయి పతనం, ఆసియా మార్కెట్లు నష్టాల్లో ట్రేడవడం ప్రతికూల ప్రభావం చూపాయి. బ్యాంక్, వాహన, ఫార్మా షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా వంటి ఐటీ షేర్లు పెరగడంతో నష్టాలు పరిమితమయ్యాయని నిపుణులంటున్నారు.
విద్యుత్ రంగ కంపెనీలకు ఇచ్చిన రూ. 1,820 కోట్ల రుణాలను 65 శాతం నష్టంతో ఆసెట్ రీస్ట్రక్చరింగ్ కంపెనీలు (ఏఆర్సీ)కు యాక్సిస్ బ్యాంక్ అమ్మేసింది. ఆర్థిక ఫలితాలు అంచనాలను అందుకోలేకపోవడంతో యాక్సిస్ బ్యాంక్ 7.3 శాతం పతనమై రూ. 483 వద్ద ముగిసింది.
ఇండిగో ఐపీఓకు ఓవర్ సబ్ స్క్రిప్షన్
విమానయాన కంపెనీ ఇండిగో ఐపీఓ 1.55 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయింది. ఈ ఐపీఓ ద్వారా రూ.3,018 కోట్లు సమీకరించాలని ఇండిగో మాతృ కంపెనీ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ లక్ష్యంగా పెట్టుకుంది. ఐపీఓ మొదలై రెండో రోజైన బుధవారంనాడు రూ.4,000 కోట్లకు బిడ్లు వచ్చాయి. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్(క్విబ్)కు కేటాయించిన వాటా 5.15 రెట్లు సబ్‌స్క్రైబ్ అయిందని కంపెనీ పేర్కొంది.
రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించిన వాటా 19 శాతం, సంస్థాగతం కాని ఇన్వెస్టర్ల కేటగిరి వాటా 4 శాతం చొప్పున సబ్‌స్క్రైబ్ అయ్యాయని వివరించింది. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.832 కోట్ల నిధులు సమీకరించామని పేర్కొంది. మూడేళ్ల తర్వాత భారతీ ఇన్ఫ్రాటెల్ అనంతరం ఇదే అతిపెద్ద ఐపీఓ. 2012 డిసెంబర్లో భారతీ ఇన్ఫ్రా టెల్ రూ.4,000 కోట్ల సమీకరణకు గాను ఐపీఓకు వచ్చింది.