ఇటలీ నావికుడు ఇంటికెళ్లొచ్చు!
♦ ఐరాస కోర్టు అనుకూలంగా ఉత్తర్వు ఇచ్చిందన్న ఇటలీ వర్గాలు
♦ భారత సుప్రీంకోర్టుకు వెళ్లాలని ట్రిబ్యునల్ చెప్పింది: విదేశాంగ శాఖ
రోమ్/న్యూఢిల్లీ: హత్యారోపణలపై భారత్ అరెస్ట్ చేసిన ఇటలీ నావికుడికి అనుకూలంగా ఐక్యరాజ్యసమితి మధ్యవర్తి న్యాయస్థానం (ఆర్బిట్రేషన్ కోర్టు) ఆదేశాలిచ్చింది. హేగ్‌లోని ఆర్బిట్రేషన్ కోర్టులో విచారణ జరుగుతుండగా.. ఆయన తన దేశానికి తిరిగి వెళ్లేందుకు అనుమతిచ్చింది. 2012లో కేరళ సముద్ర జలాల్లో ఇద్దరు భారత జాలర్లను హత్యచేశారన్న ఆరోపణలపై ఇటలీ నావికులు మాసిమిలియానో లాటోర్, సాల్వటోర్ జిరోన్ భారత్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. లాటోర్ 2014లో గుండెపోటుకు గురవటంతో ఆయనను స్వదేశానికి పంపించారు. జిరోన్ ప్రస్తుతం ఢిల్లీలోని ఇటలీ రాయబార కార్యాలయంలో ఉన్నారు. ఈ కేసుపై ఐరాస ట్రిబ్యునల్ కోర్టుకు వెళ్లటానికి భారత్, ఇటలీ అంగీకరించాయి. ఈ నేపథ్యంలో.. విచారణ కొనసాగుతుండగా జిరోన్ తన స్వదేశానికి, ఇంటికి వెళ్లేందుకు అనుమతిస్తూ ట్రిబ్యునల్ తాజాగా ఉత్తర్వులు ఇచ్చినట్లు రోమ్ వర్గాలు తెలిపాయి. ఈ ఉత్తర్వులను మంగళవారం బహిరంగపరచే అవకాశముంది.
అది సుప్రీంకోర్టు అధికారమని ట్రిబ్యునల్ చెప్పింది: విదేశాంగ శాఖ
అయితే.. జిరోన్ బెయిల్ నిబంధనలను సడలించేందుకు ఇటలీ, భారత్‌లు భారత సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ఐరాస ట్రిబ్యునల్ ఏకగ్రీవంగా ఆదేశించిందని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్‌స్వరూప్ సోమవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. జిరోన్ బెయిల్ నిబంధలను నిర్ణయించే అధికారాన్ని భారత సుప్రీంకోర్టుకు వదిలిపెట్టిందని చెప్పారు.