ఆమెకు 95.. అయినా పోరుకు సై!
ఆగ్రా: దేశమంతటా నేడు ఓటరు దినోత్సవం జరుపుకుంటున్న 95 ఏళ్ల బామ్మ చూపిన స్ఫూర్తి చర్చనీయాంశమైంది. జల్దేవీ అనే ఈ వృద్ధ మహిళ.. ఉత్తరప్రదేశ్‌లోని ఖేరాఘర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నది. ఈమేరకు బుధవారం ఉదయం ఆగ్రాలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్‌ను దాఖలుచేసింది. చక్రాలకుర్చీలో వచ్చిన ఆమెను చూసి అధికారులు తొలుత ఆశ్చర్యపోయినా, ఆమె స్ఫూర్తిని గౌరవించారు. అవసరమైన సూచనలు ఇస్తూ నామినేషన్ పత్రాలపై సంతకాలు చేయించారు.
ఓటరు దినోత్సవం నాడు జల్ దేవీ చూపిన స్ఫూర్తిని ఎన్నికల సంఘంతోపాటు ప్రజాస్వామికవాదూ మెచ్చుకున్నారు. అన్నట్లు, ఈ బామ్మ 2015లో పంచాయితీ బోర్డు మెంబర్‌గానూ భారీ మెజారిటీతో గెలుపొందారు. ప్రధాన పార్టీల మాదిరి హంగూ, ఆర్భాటాలు లేకుండా సాదాసీదాగా ప్రచారం చేస్తానని జల్దేవీ చెప్పారు. బీఎస్పీకి చెందిన భగవాన్ సింగ్ కుష్వాహా ప్రస్తుతం ఖేరాఘర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. 403 స్థానాలున్న యూపీ అసెంబ్లీకి ఫిబ్రవరి 11 నుంచి మార్చి 4 వరకు ఏడు విడతలుగా పోలింగ్ జరగనుంది.