కండలరాణి అనుమానాస్పద మృతి!
ప్రపంచ ప్రఖ్యాత మహిళా రెజ్లర్ జోన్ లారెర్ (46) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందింది. వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ (డబ్ల్యూడబ్ల్యూఈ)లో చెయ్నా పేరుతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఆమె బుధవారం కాలిఫోర్నియాలోని తన నివాసంలో విగతజీవిగా కనిపించింది. మాదక ద్రవ్యాలు అతిగా తీసుకోవడం వల్లే ఆమె మృతిచెంది ఉంటుందని భావిస్తున్నారు.
చెయ్నా చనిపోయిన విషయాన్ని ఆమె ట్విట్టర్ అధికారిక పేజీలో ప్రకటించారు. 1997లో కండలరాణిగా డబ్ల్యూడబ్ల్యూఈలో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆమె ఎన్నో సంచలనాలు సృష్టించింది. అప్పట్లో డబ్ల్యూడబ్ల్యూఈ పేరు.. వరల్డ్ రెజింగ్ల్ ఫెడరేషన్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్)గా ఉండేది. ఈ కుస్తీ క్రీడలో ట్రిపుల్ హెచ్గా పేరొందిన పాల్ మైఖేల్ లావెస్క్యూతో కలిసి అద్భుతమైన పోరాట పటిమ చూపెట్టింది. తనదైన పంచులతో ప్రత్యర్థలకు హడల్ పుట్టించి 2001 సంవత్సరంలో వుమెన్ చాంపియన్ షిప్ సాధించింది. అంతర్జాతీయ ర్లెజింగ్ చాంపియన్ షిప్ సాధించిన మొదటి మహిళగా చెయ్నా చరిత్ర సృష్టించింది. 1999లో, 2000లో వరుసగా ఆమె రెండుసార్లు ఇంటర్ కాంటినెంటల్ చాంపియన్షిప్ ను సొంతం చేసుకుంది. ఆమె మృతి పట్ల అభిమానులు, సాటి ర్లెజింగ్ క్రీడాకారులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.