ఉమ్మడి బిల్లులు ఎవరు చెల్లించాలి?
హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలోని పెండింగ్ బిల్లులతో పాటు ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రం విడిపోయాక పలు శాఖలు సమర్పించిన బిల్లులను ఇప్పుడు ఏ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలనే దానిపై సందిగ్ధత నెలకొంది. దీంతో ఈ పంచాయతీని రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల నేతృత్వంలోని అపెక్స్ కమిటీ ముందు పెట్టాలని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ నిర్ణయించింది. వాస్తవానికి ఇలాంటి సమస్యలు తలెత్తకూడదని, ఉమ్మడి రాష్ట్ర బిల్లులన్నింటినీ రాష్ట్ర విభజనకు వారం రోజుల ముందే అంటే మే 25నే చెల్లించేందుకు ఆర్ధిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. కొన్ని శాఖల్లో నిధులు అందుబాటులో లేని కారణంగా రూ.200 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి.
కాగా, వీటిని తొలు త తెలంగాణ ఖజానా చెల్లించాలని, ఆ తర్వాత అకౌంటెంట్ జనరల్ ద్వారా అందులో 58% మేర నిధులను ఆంధ్రా ఖజానా నుంచి తెలంగాణకు బదిలీ చేయాలని ఏపీ ఆర్థిక శాఖ పేర్కొంది. రాష్ట్ర విభజన అనంతరం, విభజనకు ముందు నెలలకు సంబంధించి దాదాపు రూ.3,000 కోట్ల మేరకు బిల్లులు కూడా పెండింగ్లో ఉన్నాయి. ఈ బిల్లులన్నింటిపై నిర్ణయం తీసుకునేందుకు ఏపీ ఆర్థిక శాఖ సంబంధిత ఫైలును అపెక్స్ కమిటీకి పంపిం ది. ఏ జిల్లాల్లో పెండింగ్ బిల్లులు ఉంటే ఆ జిల్లాల రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని చెల్లించాలనే ప్రతిపాదన చేసింది.