పోరాడలేకుంటే వైదొలగండి: కేఎల్ఆర్
వట్టి మాటలొద్దని జానారెడ్డి ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: మియాపూర్ భూముల కుంభకోణంపై కాంగ్రెస్ ముఖ్యనేతలు గట్టిగా పోరాడాలని, లేదంటే తమ పదవుల నుంచి వైదొలగాలని ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కె.లక్ష్మారెడ్డి(కేఎల్ఆర్) డిమాండ్ చేశారు. రాజ్భవన్లో గవర్నర్ను కలిసిన అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడారు. మియాపూర్ భూముల కుంభకోణంలో కాంగ్రెస్పార్టీ నేతలు ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోందని, దీనికి తోడు పార్టీ ముఖ్యనేతలు కూడా సరిగ్గా స్పందించడంలేదని, దీనివల్ల తమలాంటి నాయకులకు అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. టీఆర్ఎస్లోకి వెళ్లిన పీసీసీ మాజీ అధ్యక్షుడు కె.కేశవరావు, డి.శ్రీనివాస్ ఇద్దరూ దొంగలని ఆరోపించారు.
మియాపూర్ భూముల కుంభకోణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని, దీనిపై క్రమపద్ధతిలో గట్టిగా పోరాడుతున్నామని సీఎల్పీ నేత కె.జానారెడ్డి స్పష్టం చేశారు. సీఎల్పీ సమావేశం అనంతరం తనను కలసిన మీడియా ప్రతినిధులతో జానారెడ్డి ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఈ సందర్భంగా కేఎల్ఆర్ వ్యాఖ్యలను విలేకరులు ప్రస్తావించగా జానారెడ్డి తీవ్రంగా స్పందించారు. ‘ప్రభుత్వ అక్రమాలను, అవినీతిని గట్టిగా ఎదిరిస్తున్నాం. మియాపూర్ భూములపైనా పోరాడుతున్నాం. ఆ భూముల్లో కాంగ్రెస్ నేతల భూములు ఉన్నా ఊరుకోవద్దు. వట్టిమాటలు, అనుమానాలు, ఆధారాల్లేని ప్రచారం వద్దు. ఎవరిౖMðనా భూములు ఉన్నట్టుగా ఆధారాలుంటే నిర్దిష్టంగా బయటపెట్టాలి’ అని అన్నారు.