వేగవంతంగా భూగర్భ డ్రైనేజీ పనులు
కడప నగరంలో భూగర్భ డ్రైనేజీ పథకాన్ని అమల్లోకి తేవడానికి చర్యలు వేగవంతం చేయాలని నగర మేయర్ కె. సురేష్‌బాబు, ఎమ్మెల్యే ఎస్బీ అంజద్‌బాషా సూచించారు. శనివారం ప్రజారోగ్యశాఖ, కార్పొరేషన్ అధికారులతో కలిసి ఇందుకు సంబంధించిన పనులను పరిశీలించారు. ఇన్స్పెక్షన్ ఛాంబర్లు, ప్రధాన పైపులైన్లు, మ్యాన్‌హోళ్లను క్షుణ్ణంగా పరిశీలన చేశారు.
పైపులకు ఇప్పటికే ప్రజలు అనధికారికంగా ఏర్పాటు చేసుకున్న ఇన్స్పెక్షన్ ఛాంబర్ల నుంచి మురికి నీరు వెళ్తుండటాన్ని గమనించారు. సంప్ హౌస్‌ను, నానా పల్లి వద్ద మురికినీరు నిల్వ ఉండే ఎస్టీపీని పరిశీలించారు. కొన్ని చోట్ల యూజిడీ పైపులైన్లలో కంకర, ఇసుక, పేరుకు పోయి ఉండటాన్ని చూసి వెంటనే వాటిని శుభ్రం చేయించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొన్ని చోట్ల ఇన్స్పెక్షన్ ఛాంబర్లు ఏర్పాటు చేయనందున ఈ పథకం ఆగిపోయిందని చాలామంది అనుకొంటున్నారని చెప్పారు.
ఈ అపవాదును తొలగించి పథకాన్ని కొనసాగించేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నామన్నారు. ఈ మేరకు ప్రస్తుతం మంజూరైన రూ. 36 కోట్లలో రూ. 2.50 కోట్లతో ఇన్స్పెక్షన్ ఛాంబర్లు నిర్మించడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నామన్నారు. ప్రజలు ప్రతి ఇంటికి రూ. 10 వేలు ఇప్పటికిప్పుడు భరించుకోవాలంటే కష్టమవుతున్నందున వాటిని నిర్మించి ఇస్తేనే సబబుగా ఉంటుందని సూచించారు.
కమిషనర్ చల్లా ఓబులేసు మాట్లాడుతూ నగరంలో 80 వేల ఇళ్లు ఉన్నాయని ప్రతి ఇంటికి ఇన్స్పెక్షన్ ఛాంబర్లు అవసరమవుతాయన్నారు. కొత్తగా నిర్మించుకొనే ఇళ్లకు ఇంటిప్లాన్తోపాటు యూజీడీకి రూ. 10వేలు చెల్లించాల్సివుంటుందన్నారు. పంప్ హౌస్ నిర్వహణ, విద్యుత్ చార్జీలు, సిబ్బంది జీత భత్యాలు కలిపి ఏడాదికి రూ. 2 కోట్లు ఖర్చు అవుతాయన్నారు.
తాము పంపిస్తున్న ప్రతిపాదనలకు ప్రభుత్వం నుంచి అనుమతి వస్తే ఇన్స్పెక్షన్ ఛాంబర్లు నిర్మించేందుకు వీలవుతుందని తెలిపారు. తాము పరిశీలించిన విధానాన్ని పాలకవర్గ సభ్యులందరికీ చూపేందుకు త్వరలో మళ్లీ క్షేత్ర పరిశీలన చేస్తామని కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు. పథకం నిలిచిపోయిందనే అపవాదును తొలగించేందుకు ఈ కార్యక్రమం చేపట్టనున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రజారోగ్యశాఖ ఈఈ నగేష్, కార్పొరేషన్ డీఈ కేఎం దౌలా, కార్పొరేటర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు.