ఆయిల్ లీకేజీతో ఆగిన కాచిగూడ-మదురై ఎక్స్‌ప్రెస్
బి.కొత్తకోట: ఆయిల్ లీక్ కావడంతో కాచిగూడ-మదురై ఎక్స్‌ప్రెస్(17615) ఆగిపోయింది. సాయంత్రం 4.10 గంటల నుంచి బి.కొత్తకోట మండలంలోని తుమ్మణంగుట్ట రైల్వేస్టేషన్లో ఐదున్నర గంటల పాటు ఆగిపోయింది. శనివారం ఉదయం 6.10 గంటలకు కాచిగూడలో బయలుదేరిన ఎక్స్‌ప్రెస్ కర్నూలు, అనంతపురం మీదుగా చిత్తూరు జిల్లాలోని ములకలచెరువు నుంచి తుమ్మణంగుట్ట మీదుగా చిత్తూరుకు, అక్కడి నుంచి తమిళనాడులోని మదురైకి ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటలకు చేరుకోవాలి. రైలు తుమ్మణంగుట్ట రైల్వేష్టేషన్లోకి రాగానే సాంకేతిక లోపం ఉన్నట్టు గుర్తించి అక్కడే నిలిపివేశారు. ఇంజిన్‌లో హోస్ నుంచి అయిల్ లీక్ అవుతోందని గుర్తించి మరమ్మతులకు ప్రయత్నించారు. వీలు పడలేదు.
ఈ విషయాన్ని అనంతపురం రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వేరే ఇంజిన్‌ను పంపారు. పాత ఇంజిన్‌కు కొత్త ఇంజిన్‌ను కలిపి రైలును తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. వీలుపడలేదు. చివరకు పాత ఇంజిన్‌ను తొలగించి, అనంతపురం నుంచి వచ్చిన ఇంజిన్‌తో రైలు బయలుదేరింది. రాత్రి 9.30 గంటలకు తుమ్మణంగుట్ట రైల్వేష్టేషన్ నుంచి రైలు బయలుదేరింది. ఐదురన్నర గంటలపాటు తీవ్ర ఇబ్బందులు పడిన ప్రయాణికులు చివరకు ఊపిరి పీల్చుకున్నారు. చాలామంది ప్రయాణికులు పక్కనే ఉన్న జాతీయ రహదారిపైకి చేరుకుని బస్సుల్లో తమ గమ్యస్థానాలకు వెళ్లారు.