క్రేజీ స్వీట్.. కజ్జికాయ
వింటే భారతం వినాలి.. తింటే గారెలు తినాలన్న నానుడిలో పెనుగొండ కజ్జికాయను చేర్చుకుంటారంటే అతిశయోక్తి కాదు. నోట్లో పెట్టుకోగానే అద్భుతమైన రుచి, కమ్మదనంతో దేశంలోని నలుమూలలకే కాకుండా ఇతర దేశాలకూ రెక్కలు కట్టుకుని వెళుతోంది పెనుగొండ కజ్జికాయ. నోరూరించే ఈ కజ్జికాయకు 40 ఏళ్ల చరిత్ర ఉంది.
పెనుగొండ : బందరు లడ్డూ, తాపేశ్వరం కాజా, ఆత్రేయపురం పూతరేకుల కోవలోకు చెందినదే పెనుగొండ కజ్జికాయ. పెనుగొండ పేరు చెప్పేసరికి గుర్తుకువచ్చేది కజ్జికాయే. నోరూరించే కజ్జికాయ చూసేసరికి ఒకరకమైన కాయలా కనిపించినా కొరకగానే తియ్యటి కొబ్బరి కోరుతో ఉండే పాకం నోటిలోకి వెళ్లి ’అదుర్స్’ అనిపిస్తుంది. పెనుగొండ కజ్జికాయకు చాలా చరిత్ర ఉంది. ఇక్కడ ప్రాణం పోసుకున్న ఈ మధురమైన వంటకం పలు రాజకీయ పార్టీల సమ్మేళనాల విందు భోజనాల్లో చోటు చేసుకొని ఔరా అనిపించుకొన్న సంఘటనలు కోకొల్లలు. స్వీటు ప్రియులకు కజ్జికాయ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇక్కడ తయారైన కజ్జికాయలకు రెక్కలు వచ్చి దుబాయ్ వంటి గల్ఫ్ దేశాలకే కాకుండా, అమెరికా లాంటి దేశాలకూ వెళ్తుంది. మంత్రులకు, కేంద్ర మంత్రులకు, ఉన్నతస్థాయి అధికారులకే కాదు.. సామాన్య ప్రజలకు సైతం బంధువులు ముందుగా తీసుకెళ్లేది పెనుగొండ కజ్జికాయనే. పలకరింపులకు, బంధుత్వాలకు, సిఫార్సులకు కజ్జికాయను బహుమతిగా తీసుకువెళ్లడం ఆనవాయితీగా మారిపోయింది.
40 ఏళ్ల నుంచి తయారీ
పెనుగొండ కజ్జికాయకు నలభై ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. విసుమర్తి కాళిదాసు అనే స్వీట్ వ్యాపారి పెనుగొండలో చిన్న బండితో వినాయక స్వీట్ పేరుతో వ్యాపారం ప్రారంభించి కజ్జికాయను ప్రత్యేక ఆకర్షణగా నిలిపారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ కజ్జికాయకు ఎదురు నిలిచే స్వీటు మాత్రం రాలేదు. కాళిదాసు మరణించినా కుమారులు కజ్జికాయను మరింత తీర్చిదిద్దుతూ మరింత వన్నెలద్దారు. గతంలో కేవలం కొబ్బరి కోరుతో మాత్రమే తయారయ్యే కజ్జికాయకు నేడు జీడిపప్పు, ఇతర డ్రై ప్రూట్స్ను మిళితం చేసి మరింత రుచికరంగా తయారు చేస్తున్నారు. ఉదయం తొమ్మిది గంటలకు తయారు చేస్తే 1112 గంటలకల్లా అయిపోతుంది. పెనుగొండ కజ్జికాయకు అంతటి డిమాండ్ మరి. వీరికి పెనుగొండతో పాటు తణుకులో మరో స్వీట్ షాపు ఉంది.
నేటికీ తగ్గని క్రేజ్
పెనుగొండ కజ్జికాయ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రతి ఒక్కరూ పెనుగొండ కజ్జికాయను తీసుకు వెళుతుంటారు. సిఫార్సులు చేయించుకోవడానికి, బంధువులకు ఇచ్చుకోవడానికి పెనుగొండ కజ్జికాయ బహుమతిగానే ఉంటుంది. 40 సంవత్సరాలుగా తయారు చేస్తున్నాం. నేటికీ క్రేజ్ తగ్గలేదు.
వి.కోటిలింగాలు, పెనుగొండ