హాస్యానికి చిరునామా.. జంధ్యాల
వివేక్‌నగర్: ఆరోగ్యకర హాస్యానికి చిరునామా జంధ్యాల అని, నటుడు, దర్శకుడు, మాటల రచయితగా తన ప్రతిభను చాటుకున్న మహానీయుడని వక్తలు పేర్కొన్నారు. ప్రముఖ దర్శకుడు జంధ్యాల వర్ధంతి సందర్భంగా కళానిలయం సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం కళాసుబ్బారావు కళావేదికలో జరిగిన జంధ్యాల ఆత్మీయ పురస్కార ప్రదానోత్సవ సభలో పలువురు ప్రముఖులు పాల్గొని ప్రసంగించారు. సభకు ముఖ్య అతిథిగా హాజరైన సమాచార హక్కు కమిషనర్ పి.విజయబాబు మాట్లాడుతూ కుటుంబ సమేతంగా చూడదగ్గ హాస్య చిత్రాలు నిర్మించిన జంధ్యాల లాంటి దర్శకులు అరుదుగా ఉంటారని పేర్కొన్నారు. సినీ, టీవీ నటులు ప్రదీప్ మాట్లాడుతూ జంధ్యాల ఎందరో నూతన నటులకు అవకాశం కల్పించారని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా రంగస్థల సినీ, టీవీ నటులు యు.సుబ్బరాయ శర్మకు జంధ్యాల ఆత్మీయ పురస్కారాన్ని బహూకరించి ఘనంగా సత్కరించారు. సభలో సాహితీ వేత్త డా.ద్వా.నా.శాస్త్రి, నటులు జెన్నీ, ఎ.యాదగిరి, పి.మనోహర్, ఎ.సురేందర్. పురస్కార గ్రహీత సుబ్బరాయ శర్మ తదితరులు సభలో పాల్గొని ప్రసంగించారు.