కళలకు పుట్టినిల్లు.. పాలకొల్లు
పాలకొల్లు టౌన్ : కళలకు పుట్టినిల్లైన పాలకొల్లు నుంచి ఎందరో కళాకారులు సినీ రంగంలో ప్రవేశించి తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచానికి చాటారని కేంద్ర మంత్రి వై.సుజనాచౌదరి, శాసనమండలి చైర్మన్ ఎ. చక్రపాణి, రాష్ట్ర మంత్రి పీతల సుజాత, కేంద్ర మాజీ మంత్రి దగ్గుపాటి పురదేశ్వరి, ఎంపీ గోకరాజు గంగరాజు అన్నారు. శనివారం రాత్రి పాలకొల్లులో డాక్టర్ గజల్ శ్రీనివాస్ పాలకొల్లు కళాపరిషత్ 10వ జాతీయ నాటకోత్సవాల ప్రారంభోత్సవ సభలో వారు పాల్గొని మాట్లాడారు. సభకు పరిషత్ అధ్యక్షుడు మేడికొండ శ్రీనివాస చౌదరి అధ్యక్షత వహించారు. నేటి హైటెక్ యుగంలో కూడా ఆర్థిక భారాన్ని ఎదుర్కొంటూ కళాపరిషత్‌లు నాటకాలను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ సినీ దర్శకులు ఎ. కోదండరామిరెడ్డి, బి.గోపాల్, మాటల రచయిత చింతపల్లి రమణ, నిర్మాత అడ్డాల చంటిలను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ప్రముఖ గజల్ గాయకుడు గజల్ శ్రీనివాస్, ఎమ్మెల్సీలు మేకా శేషుబాబు, అంగర రామమోహన్, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఏఎంసీ చైర్మన్ గొట్టుముక్కల గాంధీభగవాన్‌రాజు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ, డాక్టర్ కేఎస్‌పీఎన్ వర్మ, విన్నకోట వేంకటేశ్వరరావు, మానాపురం సత్యనారాయణ, మునిసిపల్ చైర్మన్ వల్లభు నారాయణమూర్తి, వైస్‌చైర్మన్ కర్నేన రోజారమణి, ఎంపీపీ పెన్మెత్స శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
సందేశాత్మకంగా సాగిన నాటికలు
సమాజంలోని పలు అంశాలను లేవనెత్తుతూ కళాకారులు నాటకాలు ప్రదర్శించారు. విలువైన మానవ దేహాలను మట్టికో...కట్టెకో బలి చేయకుండా వైద్య పరిశోధనలకు ఇస్తే భావితరాల భవిష్యత్తుకు ఉపయోగకరమని ‘స్వర్గానికి వంతెన’ నాటిక సందేశాన్నిచ్చింది. దీనికి రచన వల్లూరి శివప్రసాద్, దర్శకత్వం గంగోత్రి సాయి. ద్రాక్షారామ కళాపరిషత్ కళాకారులు ప్రదర్శించిన ‘అతనికి అటు..ఇటు’ నాటిక సంసారంలో రేగిన కలతలను సరిదిద్దుకోవాల్సిన ఆవశ్యకతను కళ్లకు కట్టింది. మూడో ప్రదర్శనగా ‘సందడే సందడి’ నాటిక ప్రదర్శించారు. జయశ్రీ శ్రీజ సాధినేని రచన, దర్శకత్వంతోపాటు సుశీల పాత్రను పోషించారు. హాస్యభరితంగా సాగిన ఈ నాటిక ద్వారా దురాశ వల్ల కలిగే నష్టాలను వివరించారు.