నన్ను అలా అంగీకరించలేదు!
తమిళ సినీ ప్రేక్షకులు తనను పక్కింటి అమ్మాయిగా అంగీకరిచలేదని నటి తాప్సీ వాపోయింది. ధనుష్‌కు జంటగా ఆడుగళం చిత్రం ద్వారా కోలీవుడ్‌కు దిగుమతి అయిన ఢిల్లీ బ్యూటీ తాప్సీ. ఆ చిత్ర విజయంతో వరుసగా ఎంగేయుం కాదల్, వందాన్ వెండ్రాన్, కాంచన–2, వైరాజావై వంటి చిత్రాల్లో నటించే అవకాశాలు అందిపుచ్చుకుంది. ఆ తరువాత అమ్మడిని కోలీవుడ్ పక్కన పెట్టేసింది. అలాగే టాలీవుడ్‌లోనూ కొన్ని చిత్రాల్లో నటించిన తాప్సీకి అక్కడ ఆశించిన విజయాలు రాలేదు.
దీంతో తనను దక్షిణాదిలో గ్లామర్‌కే వాడుకున్నారు గానీ నటనకు అవకాశం ఉన్న పాత్రలు ఇవ్వలేదని తన ఆవేదనను బహిరంగంగానే వ్యక్తం చేసింది. అయితే బాలీవుడ్ ఈ అమ్మడిని అక్కున చేర్చుకుంది. అక్కడ నటించిన బాబీ, పింక్, రన్నింగ్ షాది వంటి చిత్రాలకు విశేష ఆదరణ లభించింది. ముఖ్యంగా బిగ్‌బీ అమితాబ్‌బచ్చన్‌తో నటించిన పింక్ చిత్రంలో తాప్సీ నటనకు మంచి మార్కులు పడ్డాయి. తాజాగా నామ్ షబానా అనే చిత్రంలో నటించింది. ఈ చిత్రం ఈ నెల 31న హిందీతో పాటు, నాన్‌దాన్ షబానా పేరుతో తమిళంలోనూ విడుదల కానుంది.
ఈ చిత్ర ప్రమోషన్లో భాగంగా చెన్నై వచ్చిన తాప్సీ మాట్లాడుతూ తాను తమిళంలో నటించిన ఐదు చిత్రాల్లో నాలుగు చిత్రాలు విజయం సాధించాయని, అయినా ఎందుకనో ఇక్కడ తనకు అవకాశాలు రావడం లేదని వాపోయింది. తమిళ సినీ ప్రేక్షకులు తనను పక్కింటి అమ్మాయిగా అంగీకరించలేదని, హిందీలో మాత్రం తనకు మంచి ఆదరణ లభిస్తోందని చెప్పుకొచ్చింది. అయితే తనకు తమిళ చిత్రాల్లో నటించాలన్న కోరిక మాత్రం పోలేదని అంది.
వెట్రిమారన్ లాంటి దర్శకుల చిత్రాల్లో అవకాశం వస్తే కథ కూడా అడగకుండా నటిస్తానని అంది. కారణం వారి చిత్రాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందేనని పేర్కొంది. ఆడుగళం చిత్రానికి తనకు మినహా చాలా మందికి జాతీయ అవార్డులు వరించాయన్నారు. తనకు అలాంటి అవార్డును వెట్రిమారనే అందించాలని రిక్వెస్ట్ చేసింది. ప్రస్తుతం తాను నటించిన నాన్‌దాన్ షబానా చిత్రంలో అలాంటి పాత్రనే పోషించా నని తాప్సీ తెలిపింది.