Kanshi Ram
-
బహుజన బాంధవుడు కాన్షీరామ్
బహుజనులను రాజ్యాధికారానికి దగ్గర చేసినవారు కాన్షీరామ్. 1934 మార్చి 15న పంజాబ్ రాష్ట్రం రోపడ్ జిల్లా కావాస్పూర్ గ్రామంలో జన్మించారు. బీఎస్సీ చదివి రక్షణ శాఖలో చేరారు. 1965లో అంబేడ్కర్ జయంతినాడు సెలవు ప్రకటించాలని చేపట్టిన ఆందోళనతో ఆయన ఉద్యమ జీవితం ప్రారంభమైంది. అంబేడ్కర్ రాసిన ‘కుల నిర్మూలన’ పుస్తకం స్ఫూర్తితో పీడిత వర్గాల జీవితాల్ని రాజ్యాధికారం దిశగా తన నాయకత్వంలో ముందుకు నడిపారు. గౌతమ బుద్ధుడు, మహాత్మా జ్యోతిరావు ఫూలే, ఛత్రపతి సాహూ మహారాజ్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, నారాయణ గురు, పెరియార్ లాంటి వారిని గురువులుగా భావించారు. వారి ప్రభావంతోనే 1971లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, సంక్షేమ సంఘం ఏర్పాటు చేశారు. తదనంతరం 1978లో బ్యాక్వార్డ్ అండ్ మైనారిటీ కమ్యూనిటీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (బామ్ సెఫ్)ను స్థాపించి అణగారిన వర్గాలలో ఎదిగినవారు తమ వర్గాల అభ్యున్నతికి తోడ్పడే విధంగా కృషి చేశారు. ‘రాజ్యాధికారమే మాస్టర్ కీ’ అన్న అంబేడ్కర్ మాటలను ఆదర్శంగా తీసుకొని 1984లో బహుజన్ సమాజ్ పార్టీ స్థాపించారు. బహుజన సమాజాన్ని రాజ్యాధికారం వైపు నడిపించడానికి అంబేడ్కర్ చెప్పిన విధంగా ‘బోధించు, సమీకరించు, పోరాడు’ సిద్ధాంతానికి అనుగుణంగా 1983 మార్చి 15న ఢిల్లీ నుండి బయలుదేరి ఏడు రాష్ట్రాల మీదుగా 100 సైకిళ్ళతో 40 రోజులలో 4,200 కిలోమీటర్లు ప్రయాణించి ప్రజలను బహుజన ఉద్యమం వైపు మరల్చిన గొప్ప వ్యక్తి కాన్షీరాం. ఆయన అలుపెరగని పోరాటంతో ఉత్తరప్రదేశ్‌లో బహుజనులు కొన్ని సార్లు అధికారాన్ని హస్తగతం చేసుకోవడమే కాక... దేశంలోని మిగతా ప్రాంతాల్లోనూ గణనీయమైన రాజకీయ శక్తిగా ఎదిగారు. – డాక్టర్ మొగిలి దేవప్రసాద్, సామాజిక విశ్లేషకులు, ఒంగోలు మార్చి 15న కాన్షీరామ్ జయంతి -
ఓట్లు మావి పాలన మీది ఇక నడవదు!
సాక్షి, న్యూఢిల్లీ : ‘ఓట్ హమారా రాజ్ తుమారా, నహీ చలేగా నహీ చలేగా’ అనే నినాదం 1980వ దశకంలో దళిత నాయకుడు కాన్షీరాం బాగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ నినాదం మళ్లీ మహారాష్ట్ర ఎన్నికల్లో బాగా వినిపిస్తోంది. భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేడ్కర్ మనవడు ప్రకాష్ అంబేడ్కర్ ఏర్పాటు చేసిన ‘వంచిత్ బహుజన్ అఘాది’ అనే సంకీర్ణపక్షం ఈ నినాదాన్ని మళ్లీ ప్రాచుర్యంలోకి తీసుకొచ్చింది. అఖిల భారత మజ్లీస్ ఏ ఇత్తెహాద్ ఉల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీతో కలసి ప్రకాష్ అంబేడ్కర్ ఏర్పాటు చేసిన ఈ సంకీర్ణ సంస్థ మహారాష్ట్రలోని 48వ లోక్‌సభ సీట్లకు పోటీ చేస్తోంది. మహారాష్ట్రలో దళితుల సంక్షేమం కోసం అనేక దళిత సంఘాలు పుట్టుకొచ్చి అనేక సామాజిక ఉద్యమాలను నిర్వహించాయి. సామాజిక ఉద్యమాల ద్వారా అంతో ఇంతో విజయం సాధించిన ఈ సంస్థలు, సంఘాలన్నీ రాజకీయంగా విజయం సాధించలేక పోయాయి. ఇందుకు కారణాలు రెండు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఎప్పటికప్పుడు దళిత నాయకులను ప్రలోభ పెట్టి పార్టీలోకి తీసుకోవడం, తమకు మద్దతిచ్చినట్లయితే దళితుల ఎజెండాను అమలు చేస్తామంటూ ఆశచూపించడం ఒక కారణమైతే, రాజకీయంగా చక్రం తిప్పగల దళిత నాయకుడు ఎదిగిరాక పోవడం మరో కారణం. ‘ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ అండ్ మైనారిటీస్ కమ్యూనిటీ ఎంప్యాయీస్ ఫెడరేషన్’కు చెందిన వివిధ విభాగాలు, పలు బౌద్ధ సంఘాలు, 19వ శతాబ్దంలో సంఘ సంస్కర్త జ్యోతిరావు ఫూలే ఏర్పాటు చేసిన సత్యశోధక్ గ్రూపులు దళితుల కోసం పలు సామాజిక ఉద్యమాలు నిర్వహించాయి. రాజకీయంగా మాత్రం తగిన ప్రాధాన్యతను సాధించలేక పోయాయి. జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌తోనే లేదా బీజేపీ–శివసేన కూటమితో కలిసి పోవడం వల్ల ఎన్నికల్లో దళిత పార్టీలు సొంత అస్థిత్వాన్ని నిలబెట్టుకోలేక పోయాయి. 2007లో యూపీలో అధికారంలోకి వచ్చిన మాయావతి నాయకత్వంలోని బహుజన సమాజ్ పార్టీ, ఆ ఎన్నికల ద్వారా మహారాష్ట్రలో కూడా పట్టు సాధించగలిగింది. అయితే 2014లో నరేంద్ర మోదీ నాయకత్వాన రాష్ట్రంలో వీచిన బీజేపీ–శివసేన కూటమి ప్రభంజనంలో ఆ పట్టును పూర్తిగా కోల్పోయింది. ఈ నేపథ్యంలోనే ప్రకాష్ అంబేడ్కర్ 1915లో కొత్త కూటమితో ప్రజల్లోకి వచ్చారు. అంతకుముందు ఆయన బహుజన్ మహాసంఘ్, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా’ పార్టీల తరఫున దలితుల కోసం పోరాడారు. ఈ కొత్త కూటమి కూడా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్–నేషనల్ కాంగ్రెస్ కూటమితో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తుందంటూ తొలుత వార్తవు వెలువడ్డాయి. అయితే ఆ పార్టీలతో అంటకాగకపోవడమే ‘కస్టాల్లో కలిసివచ్చిన మేలు’గా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరాఠాలో అంతగా బలం లేకపోయినప్పటికీ ‘వంచిత బహుజన అఘాది’కి అక్కడ ఏఐఎంఐఎంకున్న బలం ఉపకరిస్తుందని, ఈసారి సంకీర్ణ కూటమికి ఆరు శాతం ఓట్లు సాధించే అవకాశం ఉందని రాజకీయ పండితులు తెలియజేస్తున్నారు. వారి అంచనాలు నిజమయితే పలు లోక్‌సభ సీట్లలో బీజేపీ–కాంగ్రెస్ విజయావకాశాలపై ప్రభావం చూపడమే కాకుండా బహుజన పార్టీ రెండు, మూడు సీట్లను గెలుచుకునే అవకాశం కూడా ఉంది. అప్పుడు పార్టీ బలోపేతానికి అదే నాంది కాగలదు. ప్రకాష్ అంబేడ్కర్ అకోలా, షోలాపూర్ స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా బహుజన సమాజ్ పార్టీ షోలాపూర్ నుంచి తన అభ్యర్థిని ఉపసంహరించుకుంది. -
'మా నేతకు భారతరత్న ఇచ్చి గౌరవించండి'
న్యూఢిల్లీ: తమ నేత బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) వ్యవస్థాపకుడు కాన్షి రామ్‌కు దేశంలోని అత్యున్నత అవార్డు భారతరత్న ఇవ్వాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి డిమాండ్ చేశారు. 'ఈ రోజు కాన్షిరామ్ పుట్టిన రోజు జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా నేను కేంద్రం ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాను. బడుగు బలహీన వర్గాల ఉన్నతికి జీవితాంతం కృషి చేసిన కాన్షిరాంను గుర్తించి ఆయనకు భారత రత్న అవార్డు ఇచ్చి గౌరవించాలి' అని ఆమె రాజ్యసభలో డిమాండ్ చేశారు. కాన్షిరాం కృషి వల్లే నేడు బడుగు బలహీన వర్గాల తమ కాళ్లపై నిలబడుతున్నారని అన్నారు.