karam ravinder
-
ఆర్టీసీ కార్మికులు ఒంటరి పోరాటం చేయాలి..
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని టీఎన్జీవో అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి పిలుపునిచ్చారు. రాజకీయ ప్రమేయం లేకుండా ఆర్టీసీ సమ్మె చేయాలని ఆయన అన్నారు. ఆర్టీసీ జేఏసీ నేతలు ఆదివారం టీఎన్జీవో నేతలను కలిసి ఆర్టీసీ సమ్మెకు మద్దతు కోరారు. ఈ సందర్భంగా టీఎన్జీవో అధ్యక్షుడు రవీందర్ మాట్లాడుతూ..‘మమ్మల్ని సంప్రదించకుండా సమ్మెకు వెళ్లారు. సమ్మెకు వెళుతున్నట్లు మాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. సమ్మెకు మద్దతు ఇవ్వాలని మాపై ఒత్తిడి చేస్తున్నారు. మాపై కొన్ని సంఘాలు దుష్ప్రచారం చేస్తున్నాయి. ఆర్టీసీ సర్వీస్ రూల్స్ వేరు... మా సర్వీస్ రూల్స్ వేరు. ఆర్టీసీ సమస్యలకు ఉద్యోగ సంఘాలకు సంబంధం లేదు. సీఎంను ఉద్యోగ సంఘాలుగా మేం కలిస్తే తప్పేంటి?. 16 అంశాలతో కూడిన నివేదికతో సీఎంను కలిశాం. మాపై ఆరోపణలు చేసే నైతికత వాళ్లకు లేదు. సకల జనుల సమ్మెను నిర్వీర్యం చేసినవారే ఆర్టీసీ జేఏసీ వెనకున్నారు. టీఎన్జీవోలపై అసత్య ఆరోపణలు ఖండిస్తున్నాం. ఆర్టీసీ కార్మికులు ఒంటరిగా పోరాటం చేయాలి. సమ్మె కొన్ని రాజకీయ శక్తుల చేతిలోకి వెళ్లింది. అయితే ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు న్యాయబద్ధమైనవి. ఆర్టీసీ జేఏసీ మాతో మాట్లాడితే మేము వాళ్లకు మద్దతుపై ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతాం. కార్మికులు ఎవరూ అధైర్యపడొద్దు. ఆత్మహత్యకు పాల్పడొద్దు’ అని కోరారు. సీఎంను కలిసిన టీఎన్జీవో నేతలు (ఫైల్ ఫోటో) టీఎన్జీవో కార్యదర్శి మమత మాట్లాడుతూ.. ‘ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఉద్యోగాల సంఘాల పై దుష్ప్రచారం జరుగుతుంది. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మేము భేటీ అయ్యాం. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం సీఎం ని కలిశాం. సీఎం ని కలిస్తే తప్పేంటి? నేరం అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. సీఎం పిలుస్తే ఉద్యోగ సంఘాల నేతలుగా వెళ్లాం. ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంలో భాగమే. ఆర్టీసీ జేఏసీ నాయకులు సైతం తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించారు. ఉద్యమం అనంతరం ఆర్టీసీ నేతలు మాతో ఎప్పుడూ కలవలేదు. ఉద్యమ జేఏసీలో ఆర్టీసీ నేతలు, నాయకులు సభ్యులుగా లేరు. ఆర్టీసీ కార్మికులు తొందరపాటు చర్యలకు పోకుండా నాయకత్వంపై ఒత్తిడి తేవాలి. రాజకీయ నేతలు ఉద్యోగ సంఘాల ఆరోపణలు చేయడం సరికాదు. ఆర్టీసీ జేఏసీ నేతలు మాతో కలుస్తే సీఎం దృష్టికి తీసుకువెళతాం’ అని అన్నారు. -
సచివాలయంలో సాంస్కృతిక కార్యక్రమాలు
► నేడు విజేతలకు బహుమతుల అందజేత సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్ర దినోత్సవం, ప్రొఫెసర్ జయశంకర్, ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి కార్యక్రమాలను పురస్కరించుకొని తెలంగాణ సచివాలయ టీఎన్జీవోల యూనియన్ ఆధ్వర్యలో గురువారం సచివాలయంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో బంగారు తెలంగాణలో ఉద్యోగుల ప్రాతపై ప్రసంగం, పరిపాలన సంస్కరణలపై వ్యాస రచన పోటీలు నిర్వహించారు. పోటీల్లో గెలుపొందిన వారికి ఈ నెల 11న (శుక్రవారం) బహుమతులు అందజేస్తామని టీఎన్జీవో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కారం రవీందర్, మామిళ్ల రాజేందర్ తెలిపారు. బహుమతుల ప్రదాన కార్యక్రమంలో మంత్రులు నాయిని, ఈటల రాజేందర్ ముఖ్య అతిథులుగా పాల్గొంటారని పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం హాజరవుతారని తెలిపారు.