ఐరన్ లేడీ స్విమ్మర్ ఎట్ 90
గ్లాస్గో (స్కాట్లాండ్): స్విమ్మింగ్ సర్క్యూట్లో ఉక్కు మహిళ (ఐరన్ లేడీ)గా పేరున్న హంగేరి స్విమ్మర్ కటింకా హోస్జూ తన ఖాతాలో 90వ పతకాన్ని జమ చేసుకుంది. యూరోపియన్ షార్ట్ కోర్స్ చాంపియన్‌షిప్‌లో గురువారం జరిగిన 400 మీటర్ల వ్యక్తిగత మెడ్లే విభాగంలో బరిలో దిగిన 30 ఏళ్ల కటింకా అందరి కంటే ముందుగా 4ని.25.10 సెకన్లలో గమ్యాన్ని చేరి పసిడి పతకాన్ని సాధించింది.
దీంతో తన 15 ఏళ్ల కెరీర్లో సాధించిన పతకాల సంఖ్యను 90కు పెంచుకుంది. ఇందులో 60 పసిడి పతకాలు ఉండటం విశేషం. ఒలింపిక్స్‌లో మూడు స్వర్ణాలు నెగ్గిన కటింకా 25 పసిడి పతకాలను ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో, 31 బంగారు పతకాలను యూరోపియన్ చాంపియన్‌షిప్‌లలో సాధించింది. గత ఏడాది తన కోచ్, భర్త షేన్ టసప్తో తెగదెంపులు చేసుకున్న కటింకా... వారం రోజుల క్రితం ప్రస్తుత కోచ్ అర్పద్ పెట్రోవ్కూ గుడ్‌బై చెప్పేసి 2020 టోక్యో ఒలింపిక్స్‌కు కోచ్ లేకుండానే ఒంటరిగా సన్నద్ధమవుతోంది.