సాధారణ పనులపై దృష్టి సారించాలి
ఎన్నికలు ముగిశాయి, ఇక సాధారణ పనులపై దృష్టి సారించాలని కలెక్టర్ అహ్మద్‌బాబు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల విభాగానికి ముందు కలెక్టర్ అధికారులతో మాట్లాడారు. వేసవిలో తాగునీటి సమస్య, ఖరీఫ్ సీజన్ ప్రారంభం నేపథ్యంలో సక్రమంగా విత్తనాలు పంపిణీ చేయాలని పేర్కొన్నారు. సరిపడా ఎరువులు, విత్తనాలు జిల్లాకు చేరుకున్నాయా అని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ ఏడాది పది, ఇంటర్మీడియెట్ ఫలితాలు తక్కువగా వచ్చాయని, వచ్చే ఏడాది 75 శాతం నుంచి 80 శాతం ఫలితాలు సాధించాలని తెలిపారు. ఇప్పటి నుంచి విద్యాశాఖ పిల్లల చదువుపై దృష్టి సారించాలని అన్నారు. పాఠ్యపుస్తకాలు వచ్చాయని, ఇప్పటికే కొన్ని మండలాల్లో పంపిణీ చేశారని తెలిపారు. ఈ నెలలో వైద్యశాఖ ఆధ్వర్యంలో ‘మార్పు’ అనే కార్యక్రమం ప్రారంభించనున్నట్లు చెప్పారు. అధికారులందరూ భాగస్వాములు కావాలని అన్నారు. అనంతరం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అదనపు జేసీ ఎస్ఎస్ రాజు, జెడ్పీ సీఈవో అనితాగ్రేస్, డ్వామా పీడీ వినయ్‌కృష్ణారెడ్డి, సీపీవో షేక్మీరా, ఆర్డీవో సుధాకర్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
సోయా విత్తనాలపై 50శాతం సబ్సిడీ ఇవ్వాలని వినతి
ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో సోయా విత్తనాలపై 50శాతం సబ్సిడీ ఇవ్వాలని నిర్మల్ ఎమ్మెల్యే ఇంద్రకరణ్‌రెడ్డి, సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కలెక్టర్ అహ్మద్‌బాబుకు కోరారు. సోమవారం కలెక్టర్‌ను తన క్యాంపు కార్యాలయం కలిసి విన్నవించారు. ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన 25 శాతాన్ని 50శాతానికి పెంచేలా చూడాలని కోరారు. సోయా విత్తనాలు క్వింటాల్‌కు రూ.3వేల నుంచి రూ.3,500కు విక్రయించారని తెలిపారు. ఈ ఏడాది 25శాతం సబ్సిడీతో క్వింటాల్‌కు రూ.7,535 ధర ప్రకటించారని పేర్కొన్నారు. జిల్లాలో సోయా పంట ఎక్కువగా పండిస్తారని, 50శాతం సబ్సిడీ ఇవ్వాలని అన్నారు. గత ఏడాది సబ్సిడీ డబ్బులు ఇంతవరకు రైతుల ఖాతాల్లో జమ కాలేదని తెలిపారు.
ఫిర్యాదుల విభాగం వెల వెల.. వీడియో కాన్ఫరెన్స్ కళకళ
వరుస ఎన్నికలు, ఓట్ల లెక్కింపు, కోడ్ నేపథ్యంలో ప్రజాఫిర్యాదుల విభాగం నిలిపి వేసిన విషయం తెలిసిందే. సోమవారం ప్రారంభమై ప్రజాఫిర్యాదుల విభాగానికి అర్జీదారులు హాజరైనా.. ఆయా శాఖల అధికారులు పూర్తి స్థాయిలో హాజరు కాలేదు. దీంతో అధికారులు లేక ఫిర్యాదుల విభాగం బోసిపోయింది. తహశీల్దార్ కిరణ్‌ప్రకాశ్, ఎంపీడీవో సయ్యద్సాజిద్ అలీ, ఏవో వీణ, వర్క్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, ఆర్డబ్ల్యూఎస్ అధికారి శేఖర్ హాజరయ్యారు. కాగా, సాయంత్రం నుంచి రాత్రి వరకు జరిగిన కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్‌కు అధికారులు అధిక సంఖ్యలో హాజరు కావడం కొసమెరుపు. తహశీల్దార్ చాంబర్లో స్థలం లేక కొందరు అధికారులు ఆరుబయట గదుల్లో వేచి చూడడం కనిపించింది. - న్యూస్‌లైన్, ఖానాపూర్
ఆరు నెలలుగా వేతనాలు లేవు
మంచినీటి సమస్యపై గ్రామాల్లో పర్యటిస్తూ.. సమస్యను పరిష్కరిస్తూ.. తీవ్రమైన సమస్య ఉంటే ఉన్నతాధికారులకు తెలియజేస్తూ విధులు నిర్వర్తిస్తున్న తమకు ఆరు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని ఆర్‌డబ్ల్యూఎస్‌లోని టెక్నికల్ అసిస్టెంట్లు సోమవారం కలెక్టర్ అహ్మద్ బాబుకు విన్నవించారు. 40 మంది పని చేస్తున్నామని, నెలకు రూ.లక్ష వరకు ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు వస్తాయని, అధికారులు తమకు ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ వేసవిలో ఏజెన్సీ ప్రాంతాల్లోని మారుమూల గ్రామాల్లో నీటి సమస్య పరిష్కరించామని, అధికారులకు విన్నవించామని తెలిపారు. వేతనాలు అందకపోవడంతో ఏజెన్సీ ప్రాంతాలకు మోటారుసైకిల్‌పై వెళ్లి విధులు నిర్వర్తించడం కష్టంగా ఉందని తెలిపారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో టెక్నికల్ అసిస్టెంట్లు రాజశేఖర్, రామునాయక్, ఎండి.అజార్, చంద్రశేఖర్, మోహన్ ఉన్నారు.
పాసుపుస్తకాలు చేసివ్వడం లేదు
మా గ్రామ శివారులో నాకు సర్వే నంబరు 386లో 50 ఎకరాల భూమి ఉంది. కొన్నేళ్లుగా సాగు చేస్తున్నం. కొన్ని రోజుల క్రితం నాకు తెలియకుండా 20 ఎకరాల భూమిని వేరే వ్యక్తులకు పట్టా చేసి ఇచ్చారు. నాకు 50 ఎకరాల భూమిని పట్టా చేసివ్వమంటే అధికారులు ఇబ్బందులు పెడుతున్నరు. ఇంటి స్థలం కూడా పట్టా చేసివ్వాలి. ఇందుకోసం పదేళ్ల నుంచి తిరుగుతున్నా పట్టాపాస్‌పుస్తకాలు ఇవ్వడం లేదు. కార్యాలయానికి రావొద్దని అధికారులు బెదిరిస్తుండ్రు. కలెక్టర్‌కు నాలుగు సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. నా భూమిని పట్టా చేసి పాసుపుస్తకాలు ఇవ్వాలి. - అంబకంటి గంగన్న, కుంటాల