టికెట్ రాలేదని టీడీపీ ఇన్‌ఛార్జి ఆత్మహత్యాయత్నం!
సాక్షి, కర్నూలు: టీడీపీ-జనసేనల ఫస్ట్ లిస్ట్.. ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. టికెట్లు దక్కని ఇరు పార్టీల ఆశావహులు.. రోడ్డెక్కి తమ నిరసనలు తెలుపుతున్నారు. తమకు అన్యాయం జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేసేవాళ్లు కొందరైతే.. అసహనం ప్రదర్శిస్తున్నవాళ్లు మరికొందరు. ఈ క్రమంలో టీడీపీ కోడుమూరు ఇన్‌ఛార్జి ఏకంగా ఆత్మహత్యాయత్నం చేయడం జిల్లాలో కలకలం రేపింది.
కోడుమూరు నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జి ఆకెపోగు ప్రభాకర్ శనివారం రాత్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. మూడేళ్లుగా ఆ పార్టీ ఇన్చార్జిగా ఆయన పని చేస్తున్నారు. దీంతో టికెట్ కచ్చితంగా తనకే వస్తుందని ధీమాతో ఉన్నారాయన. అయితే.. అధిష్టానం మాత్రం తొలి జాబితాలో బొగ్గుల దస్తగిరి పేరు ప్రకటించింది. దీంతో.. ఆయన ఆవేదనతో పురుగుల మందు తాగారు. అయితే కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది.
పార్టీ కోసం కష్టపడి పని చేస్తున్నా ఫలితం ఇదేనా? అని ఆయన కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. నిర్దాక్షిణ్యంగా ప్రభాకర్‌ను పక్కన పెట్టడంపై ఆయన అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ సమీకరణాల పేరుతో అన్యాయం చేస్తున్నారంటూ ప్రభాకర్ భార్య జయంతి ఓ వీడియో రిలీజ్ చేశారు. టికెట్ విషయంలో పునరాలోచన చేయాలంటూ చంద్రబాబును ఆ వీడియోలో కోరారామె.