KTR fire
-
వాళ్లకు అభ్యర్థులే లేరు - మంత్రి కేటీఆర్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి సుమారు 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులు లేరని.. గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని 29 సీట్లలో 25చోట్ల ఈ రోజు వరకూ అభ్యర్థులు లేరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు వ్యాఖ్యానించారు. ఇతర పార్టీల నుంచి ఎవరైనా వస్తారా అని కాంగ్రెస్ ఎదురుచూస్తోందని.. చాలాచోట్ల ఇప్పటికే ఆశలు వదులుకుని నామమాత్ర పోటీకి సిద్ధమవుతోందని విమర్శించారు. కాంగ్రెస్‌లో ఎవరు ఎక్కువ డబ్బులిస్తే వారికే టికెట్ వచ్చే పరిస్థితి ఉందని ఆరోపించారు. మంత్రి కేటీఆర్ శుక్రవారం ప్రగతిభవన్‌లో మీడియాతో చిట్‌చాట్ చేశారు. మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. కేటీఆర్ చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘కాంగ్రెస్‌లో టికెట్‌కు రూ.15 కోట్లు, ఖర్చులకు మరో రూ.10 కోట్లు దగ్గర పెట్టుకోవాలని ఓ నేతకు చెప్పారట. డబ్బు సంచులను నమ్ముకుని చివరి నిమిషంలో పార్టీలోకి వచ్చేవారు గొప్పవారనే భావ దారిద్య్రం కాంగ్రెస్‌లో కనిపిస్తోంది. బెంగళూరులోని ఓ కార్పోరేటర్ భర్త ఇంట్లో రూ.42 కోట్ల నగదు దొరికింది. ఇప్పటికే మరో రూ.8 కోట్లు కొడంగల్‌లో రేవంత్‌రెడ్డికి చేరినట్టు మాకు అనధికార సమాచారం ఉంది. కష్టపడి సాధించుకున్న తెలంగాణను ఎవరి చేతిలో పెట్టాలో ప్రజలు ఆలోచించుకోవాలి. అమిత్‌షా క్షమాపణ చెప్పాలి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సిగ్గులేకుండా తెలంగాణలో రైతుల ఆత్మహత్యలపై అబద్ధాలు చెప్తున్నారు. ఆయన రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ప్రధాని మోదీ ఏదో పవిత్రాత్మ అయినట్టుగా ఏ రాష్ట్రానికి వెళ్లినా అవినీతి ప్రభుత్వాలే అంటూ మాట్లాడుతున్నారు. బీజేపీ తొమ్మిదిన్నరేళ్లలో చేసినది ఏమీ లేకనే రజాకార్లు, హిందూ ముస్లిం అంటూ రెచ్చగొడుతున్నారు. బీజేపీకి రాష్ట్రంలోని 110 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతవడం ఖాయం. ఒక గుజరాతీ (వల్లబ్‌భాయ్ పటేల్) తెలంగాణకు విముక్తి ప్రసాదించారని, మరో గుజరాతీ స్వేచ్ఛ ప్రసాదిస్తారని మోదీ అహంకారంతో మాట్లాడుతున్నారు. తెలంగాణ దాస్య శృంఖలాలు తెంచిన ఘనత కేసీఆర్‌దే. రాహుల్ లీడర్ కాదు ఎవరో ఇచ్చింది చదివే రీడర్ మాత్రమే. తెలంగాణలో మిషనరీలు, మసీదుల మీద దాడులు జరగలేదు. హైదరాబాద్ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. జాతీయ పార్టీగా ఎదగాలని అనుకుంటున్న మేం ఎవరికీ తొత్తుగా పనిచేయాల్సిన అవసరం లేదు. ఇది తెలంగాణ గల్లీకి, ఢిల్లీ అహంకారానికి, గుజరాతీ బలుపునకు జరుగుతున్న పోరాటం. అందరికీ మేలు కలిగేలా మేనిఫెస్టో.. బీఆర్ఎస్ మేనిఫెస్టోలో రైతులు, మహిళలు, దళితులు, బీసీలు, మైనారిటీలతో పాటు యువతపై ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. సామాజిక భద్రతకు పెద్దపీట వేసేలా.. మధ్య, దిగువ మధ్య తరగతి కుటుంబాలకు మేలు కలిగేలా మేనిఫెస్టో విశిష్టంగా ఉంటుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని దీనిని రూపొందించాం. సీఎం కేసీఆర్ వంద వరకు సభల్లో పాల్గొంటారు. నేను, హరీశ్‌రావు, సీనియర్ మంత్రులు స్టార్ క్యాంపెయినర్లుగా పనిచేస్తాం. కక్ష సాధింపు మా విధానం కాదు కాంగ్రెస్ నేతల ఇళ్ల మీద ఐటీ, సీబీఐ దాడులు ఎందుకు జరగడం లేదు? రేవంత్ ఇంటి చుట్టూ కబ్జాలు, సొసైటీల్లో కుంభకోణాలు తెలియవా? మేం కక్ష సాధింపు రాజకీయాలు చేయడం లేదు. మా అతి మంచితనం ప్రస్తుత రాజకీయాల్లో ఓల్డ్ ఫ్యాషన్‌గా కనిపిస్తోంది. రాష్ట్రంలో అధికారుల బదిలీలపై ఎన్నికల సంఘం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. గజ్వేల్‌లో ఈటల రాజేందర్‌తోపాటు రాష్ట్రంలో వైఎస్సార్సీపీ, ప్రజాశాంతి పార్టీతోపాటు రాహుల్, మోదీ ఎవరు పోటీ చేసినా స్వాగతిస్తాం. ఓవర్‌లోడ్‌తో వలసలు సహజమే.. చేరికలతో మా పార్టీ ఓవర్‌లోడ్ అయిన మాట వాస్తవం. బహుళ నాయకత్వం ఉన్నచోట వేరే పార్టీల్లోకి వలసలు సహజం. కాంగ్రెస్‌లో టికెట్లు ప్రకటించగానే తన్నుకుచస్తారు. కాంగ్రెస్‌లో ఇప్పటికే ఒకతను ఎల్బీ స్టేడియంలో సీఎంగా ప్రమాణం చేసేందుకు ముహూర్తాలు పెట్టుకున్నడు. ఒక మీడియా అధిపతి సమక్షంలో కాంగ్రెస్‌కు చెందిన ముగ్గురు నేతలు తలో ఏడాదిన్నర చొప్పున సీఎం పదవి అనుభవించేలా ఒప్పందం చేసుకున్నారు. చివరి ఆరు నెలలు లాటరీ పద్ధతిలో పనిచేస్తారట. ముదిరాజ్‌లకు పదవులు ఇస్తాం సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు ఇవ్వడంతో ముదిరాజ్‌లకు అవకాశం కల్పించలేకపోయాం. 2014, 18లలో మా పార్టీ నుంచి ఈటల రాజేందర్ ఒక్కరే ముదిరాజ్ కమ్యూనిటీకి చెందినవారు. ఆయన పార్టీ నుంచి వెళ్లిన తర్వాత రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండా ప్రకాశ్‌కు మండలి డిప్యూటీ చైర్మన్ హోదాతో కేబినెట్ ర్యాంకు ఇచ్చాం. భవిష్యత్తులో ముదిరాజ్‌లకు రాజ్యసభ, శాసనమండలిలో గౌరవ ప్రదమైన పదవులు ఇస్తాం. ఈ విషయాన్ని బూతద్దంలో పెట్టి చూడటం సరికాదు. పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మాతో కలసి పనిచేసేందుకు ఆసక్తి చూపితే.. నేను వ్యక్తిగతంగా వెళ్లి ఆహ్వానిస్తా..’’ అని కేటీఆర్ చెప్పారు. కామారెడ్డిలో కేసీఆర్ పోటీచేయడం వెనుక ఒక వ్యూహం ఉంటుందని.. ఆయన ఒక మ్యాన్ ఆఫ్ మిస్టరీ అని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రకటించిన సీట్లలో మార్పు చేర్పులు ఉంటాయా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. దీనిపై ఇప్పటికే సీఎం స్పష్టత ఇచ్చారని.. ఉంటే ఒకట్రెండు మార్పులు ఉండొచ్చన్నట్టుగా కేటీఆర్ సమాధానమిచ్చారు. -
గంగిరెద్దులు వస్తున్నాయి?
సాక్షి,మహబూబాబాద్/కరీమాబాద్: ‘‘సంక్రాంతి మొన్ననే పోయింది కదా.. ఊళ్లోకి ఇప్పుడెందుకు గంగిరెద్దులు వస్తున్నాయి’’అని కాంగ్రెస్ నేతలనుద్దేశించి పురపాలక, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామావు ఎద్దేవా చేశారు. పాలేరులో పంటలు నష్టపోయిన రైతులను ఓదార్చడానికి వచ్చిన కాంగ్రెస్ నాయకుల నాటకాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని చెప్పారు. బుధవారం వరంగల్ అర్బన్, మహబూబాబాద్ జిల్లాల్లో మంత్రి పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మహబూబాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన కాంగ్రెస్.. ఇప్పుడు మొసలికన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. ఆ పార్టీ నేతలు ఎన్ని గిమ్మిక్కులు చేసినా వచ్చే ఎన్నికల్లో ఫలితాలు ఏకపక్షమే ఉంటాయని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత వ్యవసాయం, గృహాలు, పరిశ్రమలకు 24 గంటల విద్యుత్‌ను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి స్పష్టం చేశారు. ఈ నెల 20 నుంచి రైతుబంధు పథకం కింద ఎకరానికి పెట్టుబడి సాయంగా రూ.8 వేలు ఇస్తామన్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక విస్మరించిందన్నారు. తాము ఇచ్చిన మాట ప్రకారం 2,630 తండాలను పంచాయతీలుగా చేశామని వివరించారు. రూ.17 వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, చందూలాల్, ఎంపీ సీతారాంనాయక్, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి తేజావత్ రాంచంద్రునాయక్, ఎమ్మెల్యేలు శంకర్‌నాయక్, రెడ్యానాయక్, ఎర్రబెల్లి దయాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు. మామునూరు ఎయిర్‌పోర్టు పునరుద్ధరణ వరంగల్ శివారులోని మామునూరు విమానాశ్రయం పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా, హైదరాబాద్ ఎయిర్‌పోర్టు అథారిటీ, ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ ఆపరేటర్స్లతో చర్చలు జరుపుతున్నట్లు వివరించారు. వరంగల్‌లో కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) మాస్టర్ ప్లాన్‌పై ఆయన సమీక్షించారు. ఇండస్ట్రియల్ కారిడార్, టూరిజం, టెక్స్టైల్ పార్కు, ఉద్యోగ కల్పనను దృష్టిలో ఉంచుకుని 9 నెలలుగా మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. నగరానికి ఔటర్ రింగ్‌రోడ్డుతోపాటు ఇన్నర్ రింగ్‌రోడ్డు కూడా ఉండాలన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా హైదరాబాద్‌లో మాదిరిగా అర్బన్ ల్యాండ్స్ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. 500 ఎకరాల మేర ల్యాండ్‌పుల్లింగ్ చేయాలని మంత్రి సూచించారు. పిక్ ఆఫ్ ది డే షేక్‌హ్యాండ్ ఇచ్చిన పోలీస్ జాగిలం ట్విట్టర్లో పోస్టు చేసిన మంత్రి కేటీఆర్ సాక్షి ప్రతినిధి, వరంగల్: మంత్రి కేటీఆర్ వరంగల్ పర్యటన సందర్భంగా పోలీసు బందోబస్తులో భాగంగా వచ్చిన శునకం ఆయన్ని ఆకట్టుకుంది. ‘కుడా’కార్యాలయంలో జరిగిన సమీక్షలో పాల్గొనేందుకు సమావేశ మందిరంలోకి వెళ్తుండగా అక్కడే ఉన్న శునకం.. మంత్రికి సెల్యూట్ చేసింది. ఆ వెంటనే షేక్‌హ్యాండ్ ఇచ్చింది. అక్కడే ఉన్న ఫొటోగ్రాఫర్లు ఈ దృశ్యాన్ని కెమెరాల్లో బంధించారు. పర్యటన అనంతరం మంత్రి తన ట్విట్టర్లో ఆ ఫొటోను పోస్టు చేస్తూ ‘మై ఫేవరేట్ పిక్ ఆఫ్ ది డే ఫ్రం వరంగల్, రాన్ ఇంటూ స్వీటీ, ఈ పోలీస్ కెనీన్ హూ ఆఫర్డ్ ఏ వార్మ్ హ్యాండ్‌షేక్’అంటూ కామెంట్ రాశారు. -
'చంద్రబాబుకు మతిచలించింది'
సాక్షి, హైదరాబాద్: ‘‘హైదరాబాద్‌ను తానే అభివృద్ధి చేశానంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మతి చెలించింది. హైదరాబాద్‌ను ఏ నాయకుడూ ఉద్ధరించలేదు’’అని పంచాయితీరాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్న సందర్భంగా.. ప్రభుత్వం సాధించిన విజయాలు, ముందున్న లక్ష్యాపై మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. హైదరాబాద్ నగరానికి సహజంగానే ఎన్నో హంగులున్నాయని, వాటిని ప్రపంచానికి పరిచయం చేసి విశ్వనగరం ఎదిగేందుకే తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. చంద్రబాబు పుట్టకముందే తెలంగాణ మిగులు రాష్ట్రమన్న విషయాన్ని గుర్తించాలన్నారు. ఏపీ ప్రజలతో కయ్యం లేదు.. ఏపీ వారిపై తెలంగాణ ప్రజలకు ఎటువంటి ద్వేషం లేదన్నారు. తెలంగాణ వస్తే.. కట్టుబట్టలతో తరిమి కొడతారని ప్రచారం చేశారని, గత ఏడాది కాలంగా అటువంటిది ఒక్క సంఘటనైనా జరిగిందా అని ప్రశ్నించారు. అన్నదమ్ముల్లా విడిపోయినా, ఏపీ కూడా అభివృద్ధి చెందాలని తాము కోరుకుంటున్నామన్నారు. తన అమెరికా పర్యటన సందర్భంగా ఎంతోమంది ఆంధ్రప్రాంతం వారు తనను కలిశారని చెప్పారు. వాస్తవానికి రాష్ట్రం విడిపోకుంటే.. ఏపీకి ప్పుడు రాబోతున్నన్ని సదుపాయాలు(విమానాశ్రయాలు, ఇతర హంగులు) ఎప్పటికీ వచ్చేవి కాదని వారితో చెప్పానన్నారు. పనిలేకే ‘రాహుల్’ పర్యటన ‘కాంగ్రెస్‌కు అధికారంలేదు.. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రాహుల్‌గాంధీకి పనిలేదు’అని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. కేవలం ప్రచారం కోసం, ఉనికి కోసమే తిరుగుతున్నామంటే.. మాకేం అభ్యంతరం లేదన్నారు. రాష్ట్రంలో రైతులకు అన్ని(ఎరువులు, విత్తనాల సబ్సిడీ, ఉచిత విద్యుత్, రుణ మాఫీ) విధాలుగా ప్రోత్సాహం అందిస్తున్నా.. ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయో అర్థం కావట్లేదన్నారు. వ్యవసాయంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు స్పష్టమైన అవగాహన ఉందన్నారు. ఫార్మ్ మెకానిజమ్, గ్రీన్ హౌస్ కల్టివేషన్, పశువుల పెంపకం.. వంటి కార్యక్రమాల ద్వారా రైతాంగం ఆదాయాన్ని మెరుగు పరచాలని సీఎం యోచిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.