'చంద్రబాబుకు మతిచలించింది'
సాక్షి, హైదరాబాద్: ‘‘హైదరాబాద్‌ను తానే అభివృద్ధి చేశానంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మతి చెలించింది. హైదరాబాద్‌ను ఏ నాయకుడూ ఉద్ధరించలేదు’’అని పంచాయితీరాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్న సందర్భంగా.. ప్రభుత్వం సాధించిన విజయాలు, ముందున్న లక్ష్యాపై మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. హైదరాబాద్ నగరానికి సహజంగానే ఎన్నో హంగులున్నాయని, వాటిని ప్రపంచానికి పరిచయం చేసి విశ్వనగరం ఎదిగేందుకే తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. చంద్రబాబు పుట్టకముందే తెలంగాణ మిగులు రాష్ట్రమన్న విషయాన్ని గుర్తించాలన్నారు.
ఏపీ ప్రజలతో కయ్యం లేదు..
ఏపీ వారిపై తెలంగాణ ప్రజలకు ఎటువంటి ద్వేషం లేదన్నారు. తెలంగాణ వస్తే.. కట్టుబట్టలతో తరిమి కొడతారని ప్రచారం చేశారని, గత ఏడాది కాలంగా అటువంటిది ఒక్క సంఘటనైనా జరిగిందా అని ప్రశ్నించారు. అన్నదమ్ముల్లా విడిపోయినా, ఏపీ కూడా అభివృద్ధి చెందాలని తాము కోరుకుంటున్నామన్నారు. తన అమెరికా పర్యటన సందర్భంగా ఎంతోమంది ఆంధ్రప్రాంతం వారు తనను కలిశారని చెప్పారు. వాస్తవానికి రాష్ట్రం విడిపోకుంటే.. ఏపీకి ప్పుడు రాబోతున్నన్ని సదుపాయాలు(విమానాశ్రయాలు, ఇతర హంగులు) ఎప్పటికీ వచ్చేవి కాదని వారితో చెప్పానన్నారు.
పనిలేకే ‘రాహుల్’ పర్యటన
‘కాంగ్రెస్‌కు అధికారంలేదు.. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రాహుల్‌గాంధీకి పనిలేదు’అని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. కేవలం ప్రచారం కోసం, ఉనికి కోసమే తిరుగుతున్నామంటే.. మాకేం అభ్యంతరం లేదన్నారు. రాష్ట్రంలో రైతులకు అన్ని(ఎరువులు, విత్తనాల సబ్సిడీ, ఉచిత విద్యుత్, రుణ మాఫీ) విధాలుగా ప్రోత్సాహం అందిస్తున్నా.. ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయో అర్థం కావట్లేదన్నారు. వ్యవసాయంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు స్పష్టమైన అవగాహన ఉందన్నారు. ఫార్మ్ మెకానిజమ్, గ్రీన్ హౌస్ కల్టివేషన్, పశువుల పెంపకం.. వంటి కార్యక్రమాల ద్వారా రైతాంగం ఆదాయాన్ని మెరుగు పరచాలని సీఎం యోచిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.