వాళ్లకు అభ్యర్థులే లేరు - మంత్రి కేటీఆర్‌ ఫైర్‌ | KTR Fire On Congress Party, Says Amit Shah Should Apologize To The People Of The State - Sakshi
Sakshi News home page

వాళ్లకు అభ్యర్థులే లేరు - మంత్రి కేటీఆర్‌ ఫైర్‌

Published Sat, Oct 14 2023 2:55 AM | Last Updated on Sat, Oct 14 2023 10:33 AM

KTR Fire On Congress Party - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీకి సుమారు 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులు లేరని.. గ్రేటర్‌ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని 29 సీట్లలో 25చోట్ల ఈ రోజు వరకూ అభ్యర్థులు లేరని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు వ్యాఖ్యానించారు. ఇతర పార్టీల నుంచి ఎవరైనా వస్తారా అని కాంగ్రెస్‌ ఎదురుచూస్తోందని.. చాలాచోట్ల ఇప్పటికే ఆశలు వదులుకుని నామమాత్ర పోటీకి సిద్ధమవుతోందని విమర్శించారు. కాంగ్రెస్‌లో ఎవరు ఎక్కువ డబ్బులిస్తే వారికే టికెట్‌ వచ్చే పరిస్థితి ఉందని ఆరోపించారు. 

మంత్రి కేటీఆర్‌ శుక్రవారం ప్రగతిభవన్‌లో మీడియాతో చిట్‌చాట్‌ చేశారు. మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. కేటీఆర్‌ చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘కాంగ్రెస్‌లో టికెట్‌కు రూ.15 కోట్లు, ఖర్చులకు మరో రూ.10 కోట్లు దగ్గర పెట్టుకోవాలని ఓ నేతకు చెప్పారట. డబ్బు సంచులను నమ్ముకుని చివరి నిమిషంలో పార్టీలోకి వచ్చేవారు గొప్పవారనే భావ దారిద్య్రం కాంగ్రెస్‌లో కనిపిస్తోంది. బెంగళూరులోని ఓ కార్పోరేటర్‌ భర్త ఇంట్లో రూ.42 కోట్ల నగదు దొరికింది. ఇప్పటికే మరో రూ.8 కోట్లు కొడంగల్‌లో రేవంత్‌రెడ్డికి చేరినట్టు మాకు అనధికార సమాచారం ఉంది. కష్టపడి సాధించుకున్న తెలంగాణను ఎవరి చేతిలో పెట్టాలో ప్రజలు ఆలోచించుకోవాలి. 

అమిత్‌షా క్షమాపణ చెప్పాలి
కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సిగ్గులేకుండా తెలంగాణలో రైతుల ఆత్మహత్యలపై అబద్ధాలు చెప్తున్నారు. ఆయన రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ప్రధాని మోదీ ఏదో పవిత్రాత్మ అయినట్టుగా ఏ రాష్ట్రానికి వెళ్లినా అవినీతి ప్రభుత్వాలే అంటూ మాట్లాడుతున్నారు. బీజేపీ తొమ్మిదిన్నరేళ్లలో చేసినది ఏమీ లేకనే రజాకార్లు, హిందూ ముస్లిం అంటూ రెచ్చగొడుతున్నారు. బీజేపీకి రాష్ట్రంలోని 110 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతవడం ఖాయం. 

ఒక గుజరాతీ (వల్లబ్‌భాయ్‌ పటేల్‌) తెలంగాణకు విముక్తి ప్రసాదించారని, మరో గుజరాతీ స్వేచ్ఛ ప్రసాదిస్తారని మోదీ అహంకారంతో మాట్లాడుతున్నారు. తెలంగాణ దాస్య శృంఖలాలు తెంచిన ఘనత కేసీఆర్‌దే. రాహుల్‌ లీడర్‌ కాదు ఎవరో ఇచ్చింది చదివే రీడర్‌ మాత్రమే. తెలంగాణలో మిషనరీలు, మసీదుల మీద దాడులు జరగలేదు. హైదరాబాద్‌ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. జాతీయ పార్టీగా ఎదగాలని అనుకుంటున్న మేం ఎవరికీ తొత్తుగా పనిచేయాల్సిన అవసరం లేదు. ఇది తెలంగాణ గల్లీకి, ఢిల్లీ అహంకారానికి, గుజరాతీ బలుపునకు జరుగుతున్న పోరాటం. 

అందరికీ మేలు కలిగేలా మేనిఫెస్టో.. 
బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలో రైతులు, మహిళలు, దళితులు, బీసీలు, మైనారిటీలతో పాటు యువతపై ఎక్కువ ఫోకస్‌ చేస్తున్నాం. సామాజిక భద్రతకు పెద్దపీట వేసేలా.. మధ్య, దిగువ మధ్య తరగతి కుటుంబాలకు మేలు కలిగేలా మేనిఫెస్టో విశిష్టంగా ఉంటుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని దీనిని రూపొందించాం. సీఎం కేసీఆర్‌ వంద వరకు సభల్లో పాల్గొంటారు. నేను, హరీశ్‌రావు, సీనియర్‌ మంత్రులు స్టార్‌ క్యాంపెయినర్లుగా పనిచేస్తాం. 

కక్ష సాధింపు మా విధానం కాదు 
కాంగ్రెస్‌ నేతల ఇళ్ల మీద ఐటీ, సీబీఐ దాడులు ఎందుకు జరగడం లేదు? రేవంత్‌ ఇంటి చుట్టూ కబ్జాలు, సొసైటీల్లో కుంభకోణాలు తెలియవా? మేం కక్ష సాధింపు రాజకీయాలు చేయడం లేదు. మా అతి మంచితనం ప్రస్తుత రాజకీయాల్లో ఓల్డ్‌ ఫ్యాషన్‌గా కనిపిస్తోంది. రాష్ట్రంలో అధికారుల బదిలీలపై ఎన్నికల సంఘం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. గజ్వేల్‌లో ఈటల రాజేందర్‌తోపాటు రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ, ప్రజాశాంతి పార్టీతోపాటు రాహుల్, మోదీ ఎవరు పోటీ చేసినా స్వాగతిస్తాం. 

ఓవర్‌లోడ్‌తో వలసలు సహజమే.. 
చేరికలతో మా పార్టీ ఓవర్‌లోడ్‌ అయిన మాట వాస్తవం. బహుళ నాయకత్వం ఉన్నచోట వేరే పార్టీల్లోకి వలసలు సహజం. కాంగ్రెస్‌లో టికెట్లు ప్రకటించగానే తన్నుకుచస్తారు. కాంగ్రెస్‌లో ఇప్పటికే ఒకతను ఎల్‌బీ స్టేడియంలో సీఎంగా ప్రమాణం చేసేందుకు ముహూర్తాలు పెట్టుకున్నడు. ఒక మీడియా అధిపతి సమక్షంలో కాంగ్రెస్‌కు చెందిన ముగ్గురు నేతలు తలో ఏడాదిన్నర చొప్పున సీఎం పదవి అనుభవించేలా ఒప్పందం చేసుకున్నారు. చివరి ఆరు నెలలు లాటరీ పద్ధతిలో పనిచేస్తారట. 

ముదిరాజ్‌లకు పదవులు ఇస్తాం
సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకే టికెట్లు ఇవ్వడంతో ముదిరాజ్‌లకు అవకాశం కల్పించలేకపోయాం. 2014, 18లలో మా పార్టీ నుంచి ఈటల రాజేందర్‌ ఒక్కరే ముదిరాజ్‌ కమ్యూనిటీకి చెందినవారు. ఆయన పార్టీ నుంచి వెళ్లిన తర్వాత రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండా ప్రకాశ్‌కు మండలి డిప్యూటీ చైర్మన్‌ హోదాతో కేబినెట్‌ ర్యాంకు ఇచ్చాం. భవిష్యత్తులో ముదిరాజ్‌లకు రాజ్యసభ, శాసనమండలిలో గౌరవ ప్రదమైన పదవులు ఇస్తాం. ఈ విషయాన్ని బూతద్దంలో పెట్టి చూడటం సరికాదు. 

పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మాతో కలసి పనిచేసేందుకు ఆసక్తి చూపితే.. నేను వ్యక్తిగతంగా వెళ్లి ఆహ్వానిస్తా..’’ అని కేటీఆర్‌ చెప్పారు. కామారెడ్డిలో కేసీఆర్‌ పోటీచేయడం వెనుక ఒక వ్యూహం ఉంటుందని.. ఆయన ఒక మ్యాన్‌ ఆఫ్‌ మిస్టరీ అని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రకటించిన సీట్లలో మార్పు చేర్పులు ఉంటాయా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. దీనిపై ఇప్పటికే సీఎం స్పష్టత ఇచ్చారని.. ఉంటే ఒకట్రెండు మార్పులు ఉండొచ్చన్నట్టుగా కేటీఆర్‌ సమాధానమిచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement