మేఘనకు ఎఫ్ఓఎన్ పురస్కారం
న్యూఢిల్లీ: ప్రకృతి సంబంధిత అంశాల్లో విశిష్ట సాహిత్యాన్ని అందించినందుకుగానూ కుమొన్ లిటరరీ ఫెస్టివల్ ‘ఎఫ్ఓఎన్ (ఫెలోస్ ఆఫ్ నేచర్) సౌత్ ఏషియా స్టోరీ’ పురస్కారానికి ముంబై రచయిత్రి మేఘనా పంత్ ఎంపికయ్యారు. ఫ్రెంచ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా భాగస్వామ్యంతో కుమొన్ లిటరరీ ఫెస్టివల్ నిర్వాహకులు ఈ అవార్డును వచ్చే నెల ఆమెకు అందజేస్తారు.
పీపుల్ ఆఫ్ ది సన్ అనే చిన్నకథ రాసినందుకు మేఘన ఈ గౌరవానికి ఎంపికయ్యారు. ‘ప్రకృతి రచనల ప్రోత్సాహానికే ఈ అవార్డు కేటాయించాం. ఒకప్పుడు ఈ తరహా రచనలకు అద్భుత ఆదరణ ఉండేది. ఇప్పుడు ఇలాంటి వాటి సంఖ్య చాలా తగ్గింది. ఇది ఆందోళన కలిగించే పరిణామం. ఈ కళను పునరుద్ధరించేందుకు ఎఫ్ఓఎన్ అవార్డు సాయపడుతుంది’ అని ఫెస్టివల్ వ్యవస్థాపకుడు సుమంత్ బాత్రా తెలిపారు. ఈ పురస్కారం కింద గ్రహీతకు రూ.లక్ష నగదు అందజేస్తారు.