kurnool rural
-
కర్నూల్ పీఎస్‌లో ముగిసిన జేసీ విచారణ
సాక్షి, కర్నూల్: జిల్లాలోని రూరల్ పోలీసు స్టేషన్లో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి విచారణ శుక్రవారం ముగిసింది. దాదాపు రెండున్నర గంటల పాటు జేసీని పోలీసులు విచారించారు. అదే విధంగా ఓర్వకల్లు పోలీసు స్టేషన్లో నమోదైన కేసులపై కూడా పోలీసులు విచారించారు. తప్పుడు పత్రాలతో 3 లారీల విక్రయాలపై ఓర్వకల్లు పోలీసుల స్టేషన్లో జేసీపై కేసు నమోదైన విషయం తెలిసిందే. వాహనాలను చవ్వా గోపాల్‌రెడ్డి అనే వ్యక్తి డ్రైవర్ నాగన్న పేరు మీద నకిలీ చిరునామాతో రిజిస్ట్రేషన్ చేయించినట్లు పోలీసులు గర్తించారు. ఇక విచారణ అనంతరం జేసీ ప్రభాకర్‌రెడ్డిని తిరిగి కడప సెంట్రల్ జేలు తరలించినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: నేరం అంగీకరించిన జేసీ ప్రభాకర్‌రెడ్డి! -
చెవి కొరికి..చెప్పులతో కొట్టుకున్న వీఆర్వోలు
సాక్షి, కర్నూలు రూరల్: గ్రామస్థాయిలో ప్రజా సమస్యలకు పరిష్కారం చూపాల్సిన వీఆర్వోలు విచక్షణ మరిచారు. తాము ప్రభుత్వ ఉద్యోగులం అన్న మాట మరచి వీధి రౌడీల్లా మారిపోయారు. యుష్టి యుద్ధానికి దిగారు.. చెప్పులతో దాడి చేసుకున్నారు. కోపోద్రిక్తుడైన ఓ వీఆర్వో.. చెవి కొరికి కక్ష తీర్చుకున్నాడు. ఆదివారం ఉదయం కర్నూలు తహసీల్దార్ కార్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కర్నూలు మండలం సుంకేసుల వీఆర్వోగా వేణుగోపాల్ రెడ్డి కొనసాగుతున్నాడు. ఈయనకు వెబ్‌ల్యాండ్‌లో ఆన్లైన్ నమోదు చేసే బాధ్యతను తహసీల్దార్ తిరుపతి సాయి అప్పగించారు. తహసీల్దార్ డిజిటల్ కీని సైతం జూలై నెలలో ఇచ్చారు. అప్పటి నుంచి ఆన్లైన్లో పేర్లు మార్పులు, చేర్పులు చేస్తున్నాడు. ప్రతీ ఆన్లైన్ మార్పు, చేర్పునకు ఆ గ్రామంలో భూమికి ఉన్న ధరను బట్టి ఎకరానికి రేటు నిర్ణయించి తీసుకునేవాడని రైతులు చెబుతున్నారు. జొహరాపురానికి చెందిన మహేశ్వరయ్య పేరు ఆన్లైన్లో మహేశ్వరమ్మ అని పడింది. అలాడే అదే గ్రామానికి చెందిన పాండురంగస్వామి ఇంటి పేరు ఆన్లైన్లో నమోదు కాలేదు. ఈ రెండింటిని మార్చాలని జొహరాపురం వీఆర్వో శ్రీకృష్ణదేవరాయలు ఫైల్ పెట్టాడు. రెండు వారాలైనా పనికాకపోవడంతో ఆదివారం ఉదయం వేణుగోపాల్‌రెడ్డిని శ్రీకృష్ణదేవరాయలు గట్టిగా నిలదీశాడు. మాటామాటా పెరిగి ఇద్దరు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఈ నేపథ్యంలో వేణుగోపాల్ రెడ్డి చెవిని శ్రీకృష్ణదేవరాయలు కొరికాడు. దీంతో చెవి నుంచి విపరీతంగా రక్త్రస్తావమైంది. ఇద్దరూ రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లడంతో వెంటనే తహసీల్దార్ తిరుపతి సాయి కలుగజేసుకొని తహసీల్దార్ కార్యాలయంలో రాజీ కుదిర్చడానికి ప్రయత్నించాడు. మరోసారి ఇద్దరు వీఆర్వోలు రెచ్చిపోయి సాక్షాత్తూ తహసీల్దార్ ముందే ఒకరినొకరు చెప్పులతో దాడి చేసుకున్నారు. మరో సారి వేణుగోపాల్‌రెడ్డికి చెవిని శ్రీకృష్ణదేవరాయలు కొరికాడు. వీఆర్వో శ్రీకృష్ణదేవరాయలు.. రైతుల నుంచి ఆన్లైన్ ఎక్కించడానికి రూ.లక్షలు తీసుకున్నాడని, తనకు చిల్లిగవ్వ ఇవ్వడంలేదన్న భావన వీఆర్వో వేణుగోపాల్‌రెడ్డి నుంచి వ్యక్తం అయింది. ఇద్దరు వీఆర్వోల సస్పెన్షన్ – ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్ కర్నూలు(సెంట్రల్): కర్నూలు తహసీల్దార్ కార్యాలయంలో బాహాబాహీకి దిగిన ఇద్దరు వీఆర్వోలపై జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ వేటు వేశారు. జొహరాపురం వీఆర్వో కృష్ణదేవరాయులు, సుంకేసుల వీఆర్వో వేణుగోపాల్‌రెడ్డిలపై క్రమశిక్షణ చర్యల కింద సస్పెండ్ చేస్తున్నట్లు రాత్రి విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రెవెన్యూ అధికారులు, సిబ్బంది.. కార్యాలయాల బయట, లోపల ప్రజలకు అనుకువగా ఉండి గౌరవ మర్యాదలను పొందాలని సూచించారు. అవినీతికి దూరంగా ఉండాల్సింది పోయి గొడవలు పడడం దారుణమన్నారు. భవిష్యత్‌లో మరెవరైనా ఇలాంటి ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
తుంగా పరవళ్లు.. కృష్ణమ్మ ఉరకలు
కర్నూలు రూరల్: కర్ణాటక, మహారాష్ట్రల్లో కురుస్తున్న భారీ వర్షాలతో తుంగభద్ర, కృష్ణా బేసిన్‌లోని ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల జలాశయాలకు వరద నీరు పోటెత్తుతోంది. నిండు కుండలను తలపిస్తున్న ప్రాజెక్టుల నుంచి దిగువకు నీరు విడుదలవుతోంది. శ్రీశైలం జలాశయంలో వరద ప్రవాహం భారీగా వచ్చి చేరుతుండటంతో తెలుగుగంగ, ఎస్ఆర్బీసీ, కేసీ కెనాల్ ఆయకట్టు రైతుల్లో ఖరీఫ్ ఆశలు చిగురిస్తున్నాయి. సీజన్ ప్రారంభమై రెండు నెలలు గడిచినా తుంగభద్ర, కృష్ణా పరీవాహకంలోని జలాశయాల్లో నీరు అడుగంటడం అన్నదాతను ఆందోళనకు గురిచేసింది. వరుణుడు ఆలస్యంగానైనా కరుణించడంతో ఇప్పుడిప్పుడే ప్రాజెక్టులకు జల కళ వస్తోంది. కర్ణాటకలోని తుంగభద్ర డ్యాం నిండటంతో శనివారం 10 గేట్లను రెండు మీటర్లు పెకైత్తి 22వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. మరో నాలుగైదు రోజుల్లో ఈ జలాలు జిల్లాకు చేరనున్నాయి. ఈ దృష్ట్యా నీటి పారుదల శాఖ అధికారులు రెండు రోజుల ముందు నుంచే కేసీ కెనాల్‌కు నీరు విడుదల చేస్తున్నారు. తుంగభద్ర, కృష్ణా నదుల నుంచి వస్తున్న వరద నీటితో శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వ రెండు రోజులకే 10 అడుగుల మేర పెరిగింది. ప్రస్తుతం నీటి మట్టం 842 అడుగులకు చేరుకోగా.. 60 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సాధారణంగా ప్రాజెక్టులో నీటి మట్టం 854 అడుగులకు చేరుకుంటే పోతిరెడ్డిపాడుకు సాగునీరు విడుదల చేయాల్సి ఉంది. అయితే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, తెలుగుగంగ, ఎస్ఆర్బీసీ సర్కిల్ 1, 2లకు శ్రీశైలం జలాలను విడుదల చేయాలంటే ఈ ఏడాది నుంచి కృష్ణా బోర్డు అనుమతించాల్సి ఉంది. గతంలో నీటి విడుదలను నిర్ణయించే శివం కమిటీని రాష్ట్ర విభజన తర్వాత రద్దు చేసి కృష్ణా బోర్డులను ఏర్పాటు చేయడంతో ఈ పరిస్థితి తలెత్తింది. పది రోజుల్లో శ్రీశైలంలో పూర్తి స్థాయి నీటిమట్టం శ్రీశైలం జలాశయంలోకి ప్రస్తుతం వస్తున్న ఇన్‌ఫ్లో కొనసాగితే మరో పది రోజుల్లో పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంటుంది. 854 అడుగులకు చేరుకున్న తర్వాత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పోతిరెడ్డిపాడు ఆధారిత సాగునీటి ప్రాజెక్టులకు నీటి విడుదల నిర్ణయిస్తాం. నీటి లభ్యత ఆధారంగా వాటాలను కేటాయించారు. - కాశీ విశ్వేశ్వరరావు, నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ -
కొత్త ప్రభుత్వంలోనే బదిలీలు
కర్నూలు రూరల్, న్యూస్‌లైన్: ఎన్నికల ప్రక్రియ ముగిసింది. అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. విధుల్లో పాల్గొనేందుకు వచ్చిన ఇతర జిల్లాల అధికారులు ఆయా ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా చేదువార్త వారి చెవిన పడింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు జిల్లాను వీడే అవకాశం లేదని తెలిసి నిట్టూరుస్తున్నారు. వాస్తవానికి ఎన్నికలు పూర్తయ్యాక.. బదిలీల ప్రక్రియను ఈనెల 24 లోపు పూర్తి చేయాల్సి ఉంది. అయితే కొత్త ప్రభుత్వ ఏర్పాటు మెలికతో ఇతర జిల్లాల నుంచి వచ్చిన ఎంపీడీఓలు, తహశీల్దార్లు, పోలీసు అధికారులకు మరో 15 రోజుల పాటు పడిగాపులు తప్పదని తెలుస్తోంది. ఎన్నికల సందర్భంగా జిల్లాలో మూడు సంవత్సరాలకు పైబడి పని చేస్తున్న అధికారులను ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఇతర జిల్లాలకు బదిలీ చేయడం తెలిసిందే. అందులో భాగంగానే గత ఫిబ్రవరిలో జిల్లాకు అనంతపురం, కడప, చిత్తూరు నుంచి 48 మంది తహశీల్దారు, 37 మంది ఎంపీడీఓలు.. కొందరు పోలీసు అధికారులు బదిలీపై వచ్చారు. ఎన్నికల తంతు పూర్తి కావడంతో వారంతా తిరిగి ఆయా జిల్లాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈనెల 24వ తేదీతో తాము వెళ్లిపోవచ్చని భావించగా.. రాష్ట్రపతి పాలన అమల్లో ఉన్నందున ఆ ప్రక్రియ విధివిధానాలపై కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చే నివేదికపై దేశ ప్రధాని ఆమోదం తెలపాల్సి ఉందని తెలిసి నిరాశకు లోనవుతున్నారు. యూపీఏ ప్రభుత్వం ఘోర పరాజయం పాలవడం.. ఎన్డీఏ అధికారంలోకి రావడంతో ఉద్యోగుల బదిలీలకు సాంకేతిక కారణాలు అడ్డొస్తున్నట్లు తెలిసింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి పదవీ విరమణ చేయడం.. కొత్త సీఎస్‌ను నియమించకపోవడం.. రాష్ట్ర విభజన ప్రక్రియకు సమయం దగ్గర పడటం కూడా బదిలీల బ్రేక్‌కు కారణమైనట్లు సమాచారం. ఏదేమైనా జూన్ 2వ తేదీ తర్వాత కేంద్రం, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాలు ఏర్పాటయ్యే వరకు బదిలీలపై ఉద్యోగులు ఆశలు వదులుకోవాల్సిందే.