కర్నూలు రూరల్: కర్ణాటక, మహారాష్ట్రల్లో కురుస్తున్న భారీ వర్షాలతో తుంగభద్ర, కృష్ణా బేసిన్‌లోని ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల జలాశయాలకు వరద నీరు పోటెత్తుతోంది. నిండు కుండలను తలపిస్తున్న ప్రాజెక్టుల నుంచి దిగువకు నీరు విడుదలవుతోంది. శ్రీశైలం జలాశయంలో వరద ప్రవాహం భారీగా వచ్చి చేరుతుండటంతో తెలుగుగంగ, ఎస్‌ఆర్‌బీసీ, కేసీ కెనాల్ ఆయకట్టు రైతుల్లో ఖరీఫ్ ఆశలు చిగురిస్తున్నాయి.
సీజన్ ప్రారంభమై రెండు నెలలు గడిచినా తుంగభద్ర, కృష్ణా పరీవాహకంలోని జలాశయాల్లో నీరు అడుగంటడం అన్నదాతను ఆందోళనకు గురిచేసింది. వరుణుడు ఆలస్యంగానైనా కరుణించడంతో ఇప్పుడిప్పుడే ప్రాజెక్టులకు జల కళ వస్తోంది. కర్ణాటకలోని తుంగభద్ర డ్యాం నిండటంతో శనివారం 10 గేట్లను రెండు మీటర్లు పెకైత్తి 22వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. మరో నాలుగైదు రోజుల్లో ఈ జలాలు జిల్లాకు చేరనున్నాయి. ఈ దృష్ట్యా నీటి పారుదల శాఖ అధికారులు రెండు రోజుల ముందు నుంచే కేసీ కెనాల్‌కు నీరు విడుదల చేస్తున్నారు. తుంగభద్ర, కృష్ణా నదుల నుంచి వస్తున్న వరద నీటితో శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వ రెండు రోజులకే 10 అడుగుల మేర పెరిగింది. ప్రస్తుతం నీటి మట్టం 842 అడుగులకు చేరుకోగా.. 60 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సాధారణంగా ప్రాజెక్టులో నీటి మట్టం 854 అడుగులకు చేరుకుంటే పోతిరెడ్డిపాడుకు సాగునీరు విడుదల చేయాల్సి ఉంది. అయితే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, తెలుగుగంగ, ఎస్‌ఆర్‌బీసీ సర్కిల్ 1, 2లకు శ్రీశైలం జలాలను విడుదల చేయాలంటే ఈ ఏడాది నుంచి కృష్ణా బోర్డు అనుమతించాల్సి ఉంది. గతంలో నీటి విడుదలను నిర్ణయించే శివం కమిటీని రాష్ట్ర విభజన తర్వాత రద్దు చేసి కృష్ణా బోర్డులను ఏర్పాటు చేయడంతో ఈ పరిస్థితి తలెత్తింది.
పది రోజుల్లో శ్రీశైలంలో పూర్తి స్థాయి నీటిమట్టం
శ్రీశైలం జలాశయంలోకి ప్రస్తుతం వస్తున్న ఇన్‌ఫ్లో కొనసాగితే మరో పది రోజుల్లో పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంటుంది. 854 అడుగులకు చేరుకున్న తర్వాత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పోతిరెడ్డిపాడు ఆధారిత సాగునీటి ప్రాజెక్టులకు నీటి విడుదల నిర్ణయిస్తాం. నీటి లభ్యత ఆధారంగా వాటాలను కేటాయించారు.
- కాశీ విశ్వేశ్వరరావు, నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్
తుంగా పరవళ్లు.. కృష్ణమ్మ ఉరకలు
Published Sat, Aug 2 2014 3:30 AM | Last Updated on Sat, Sep 2 2017 11:14 AM
Advertisement
Advertisement