విద్య, వైద్యరంగాలను పరిరక్షించాలి
- కలెక్టర్కు సీపీఎం బృందం వినతి
గుంటూరు వెస్ట్ : ప్రభుత్వ విద్యాసంస్థలు, వైద్యశాలల్లోని సమస్యలను పరిష్కరించాలని సీపీఎం ప్రతినిధి బృందం శుక్రవారం జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే, జిల్లా విద్యాశాఖాధికారి కేవీ శ్రీనివాసరెడ్డిలను కలిసి వినతిపత్రాలు అందజేసింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో అనేక సమస్యలు ఉన్నాయని, ఎయిడెడ్ పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. కొత్తగా ఉపాధ్యాయులను నియమించకపోవడం వల్ల విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని అన్నారు. స్కూళ్లలో ప్రాథమిక వసతులు కల్పించాలని కోరారు.
సీపీఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యశాలల్లో డాక్టర్ పోస్టులు, జీజీహెచ్లో స్టాఫ్ నర్సుల పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని కోరారు. అన్ని సెంటర్లలో జనరిక్ మందుల షాపులను పెట్టాలని, మందులకు బడ్జెట్లో నిధులు పెంచాలని కోరారు. ఈ బృందంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై.నేతాజీ, వై.రాధాకృష్ణ, జేవీ రాఘవులు, నాయకులు ఈమని అప్పారావు, కాకుమాను నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.