దేశీ ఐటీ పరిశ్రమ ఆదాయం రూ.1.91 లక్షల కోట్లు!
న్యూఢిల్లీ: దేశీ ఐటీ సేవల కోసం వెచ్చించే వ్యయాలు ప్రస్తుత ఏడాది 13.5 శాతం వృద్ధితో రూ.1.91 లక్షల కోట్లకు చేరే అవకాశముందని రీసెర్చ్ సంస్థ కోర్ క్వాడ్రాంట్ పేర్కొంది. దీని వల్ల దేశీ ఐటీ పరిశ్రమ ఆదాయం రూ.1.91 లక్షల కోట్లకు పెరగొచ్చని అభిప్రాయపడింది. గతేడాది దేశీ ఐటీ పరిశ్రమ ఆదాయం రూ.1.68 లక్షల కోట్లుగా ఉంది. దేశంలోని పలు దిగ్గజ, మధ్యతరహా ఐటీ కంపెనీల వ్యాపార ప్రాధాన్యాలు, ప్రణాళికల ఆధారంగా నివేదికను రూపొందించినట్లు కోర్ క్వాడ్రాంట్ తెలిపింది. ఐటీ పరిశ్రమలో 2002 నుంచి చూస్తే 2013లో అత్యల్ప వృద్ధి నమోదయ్యిందని, ఇది 2014లో కాస్త పుంజుకొని, 2015లో పునరుద్ధరణ దిశగా పయనించిందని క్వాడ్రాంట్ తెలిపింది.
కానీ 2015లో ఐటీ పరిశ్రమ పనితీరు మాత్రం అంచనాలకు దిగువనే ఉందని కోర్ క్వాడ్రాంట్ సహ వ్యవస్థాపకుడు కపిల్ దేవ్ సింగ్ తెలిపారు. ప్రస్తుత ఏడాది డిజిటల్ కార్యక్రమాలు ఐటీ పరిశ్రమ ఆదాయం పెరుగుదలకు దోహదపడతాయని అభిప్రాయపడ్డారు. బిగ్‌డేటా, అనలిటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి అంశాల ప్రాధాన్యం పెరుగుతుందని తెలిపారు.