క్యజూంగలో రతన్ టాటా పెట్టుబడులు
న్యూఢిల్లీ: స్టార్టప్‌ల్లో రతన్ టాటా పెట్టుబడుల జోరు పెరుగుతోంది. తాజాగా ఆయన ఈ-టికెటింగ్ కంపెనీ క్యజూంగలో పెట్టుబడులు పెట్టారు. అయితే రతన్ టాటా ఎంతమొత్తం పెట్టుబడులు పెట్టిందీ, ఇప్పటివరకూ ఈ కంపెనీకి ఎన్ని పెట్టుబడులు వచ్చిందీ క్యజూంగ కంపెనీ వెల్లడించలేదు. ప్రపంచ స్థాయి సంస్థగా ఎదగాలనుకుంటున్న తరుణంలో రతన్ టాటా పెట్టుబడి చేయడం సంతోషాన్నిచ్చిందని క్యజూంగ సీఈఓ నీతూ భాటియా తెలిపారు.
మూడు దేశాల్లో జరిగే ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్, ఫిపా వరల్డ్ కప్, సాఫ్ కప్, అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్లను ఈ కంపెనీ ద్వారా బుక్ చేసుకోవచ్చు. అంతే కాకుండా ఇండియన్ ప్రీమియర్ లీగ్, ప్రొ కబడ్డీ లీగ్, నెహ్రూ కప్ తదితర దేశీయ టోర్నమెంట్ల మ్యాచ్‌లకు కూడా టికెట్లను బుక్ చేసుకోవచ్చు. రతన్ టాటా గత రెండేళ్లలో స్నాప్‌డీల్, పేటీఎం, ఓలా వంటి 25కు పైగా స్టార్టప్‌ల్లో పెట్టుబడులు పెట్టారు.