ఆక్రమణదారుల బంపర్ ఆఫర్
ఆదెమ్మ దిబ్బ వాసులకు ఆశ చూపిస్తున్న ఆక్రమణదారులు
మార్కెట్ విలువ రూ.లక్షకు పై మాటే
రూ.13,500కు ఇవ్వడంలో మతలబేమిటో?
ఇంత జరుగుతున్నా సంబంధితాధికారులది ప్రేక్షకపాత్రే..
ప్రభుత్వం స్వా«ధీనం చేసుకోవాలని వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్ షర్మిలా రెడ్డి డిమాండ్
సాక్షి, రాజమహేంద్రవరం:
రాజమహేంద్రవరం నడిబొడ్డున కంబాల చెరువు ప్రాంతంలో ఉన్న ఆదెమ్మ దిబ్బ స్థలాన్ని తాము కొనుగోలు చేశామని చెబుతున్న ఆసాములు అక్కడ ఉంటున్న పేదలకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. గుడిసెలు ఖాళీ చేస్తే రూ.50 వేల నుంచి రూ.70 వేలు ఇస్తామని ఓ వైపు చెబుతూ అక్కడే ఉండాలని అనుకుంటే గజం రూ.13,500లకే విక్రయిస్తామని ప్రకటిస్తున్నారు. ఇప్పటికే స్థానికంగా ఉన్న రమణ అనే వ్యక్తి తాను రూ.13,500 లెక్కన 200 గజాలు కొన్నానని ’సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. తనకు రెండు రేకుల షెడ్లున్నాయని రూ.1.4 లక్షలు ఇవ్వడంతో పక్కనే తనకు ఉన్న వాంబే గృహాల్లోకి చేరిపోయానని తెలిపారు. రాజమహేంద్రవరం నగర నడిబొడ్డున ఉన్న ఈ స్థలం ఖరీదు ప్రస్తుతం మార్కెట్ ప్రకారం గజం రూ.లక్ష వరకూ ఉంటుందని రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెబుతున్నారు. ఇంత విలువైన స్థలాన్ని కొనుగోలు చేశానని చెబుతున్న వ్యక్తి గజం రూ.13,500లకే అమ్ముతుండడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోలమూరుకు చెందిన పిన్నమరెడ్డి ఈశ్వరుడు తాను 4000 గజాల స్థలాన్ని సత్యవోలు శేషగిరిరావు వద్ద కొనుగోలు చేశానని రెవెన్యూ అధికారుల వద్ద పేర్కొన్నారు. సాధారణంగా రియల్ వ్యాపారులు లాభాలకే ప్రాధాన్యమిస్తారు. స్థలం కొనుగోలు చేసిన వ్యక్తి అక్కడ ఉన్న అక్రమణదారులను ఖాళీ చేయించడానికి భారీ మొత్తంలో నగదు ఇవ్వాల్సిన అవసరమేమిటన్న ప్రశ్న నగరవాసుల మొదడును తొలిచేస్తోంది. స్థలం కొనుగోలు చేసినప్పుడు అందుకు సంబంధించిన డాక్యుమెంట్లు కోర్టుకు చూపించి చట్ట ప్రకారం వారిని ఖాళీ చేయించవచ్చు.
గుడిసెల తొలగింపునకే రూ. 50 లక్షలు
నగరంలోని 36, 38 డివిజన్ల పరిధిలో ఆదెమ్మదిబ్బ ప్రాంతంలోని 3.54 ఎకరాల స్థలంలో 110 మంది పేదలు గుడిసెలు, రేకుల షెడ్లు వేసుకుని నివసిస్తున్నారు. ఖాళీ చేస్తే ఒక్కొక్కరికీ రూ.50 నుంచి రూ.70 వేలు చొప్పున చెల్లిస్తూ ఇప్పటికే రూ.50 లక్షలు ఖర్చు చేసినట్టు తెలిసింది. ఓ వైపు ఎదురు చెల్లింపులు ... ఇంకోవైపు బంపర్ ఆఫర్లు ఇస్తుండడంతో అనేక అనుమానాలకు తావిస్తోంది.
ఒకరి వెంట ఒకరు చెల్లాచెదురై...
ఆదెమ్మదిబ్బ స్థలంలో ఉంటున్నవారందరూ అక్కడ తాత్కాలికంగా గుడిసెలు వేసుకుని అరవై ఏళ్లుగా నివసిస్తున్నవారే. ఇందులో పలువురికి వాంబే గృహాలు కూడా వచ్చాయి. గృహాలు వచ్చిన వారు ఖాళీ చేయకుండా గుడిసెలను ఆద్దెకు ఇచ్చారు. ఇప్పడు ఆక్రమణదారులు రావడంతో ఎంత డబ్బులిచ్చినా తీసుకొని ఖాళీ చేసేస్తామని చెప్పడంతో నిజమైన పేదలు ఇబ్బందులు పడుతున్నారు.