లెట్స్ ఎంజాయ్
ఎప్పుడూ పుస్తకాలు, పాఠాలే కాదు... కాస్తంత వినోదం కూడా ఉండాలి. ఇప్పుడు కార్పొరేట్ కాలేజీల కాన్సెప్ట్ కూడా ఇదే. విద్యార్థుల్లోని క్రియేటివ్ థాట్స్‌ను ఎంకరేజ్ చేసేందుకు వినూత్న ఈవెంట్లు ప్రజంట్ చేస్తున్నాయి. అలాంటిదే ఈవారం లామకాన్‌లో ఐఎంటీ, హైదరాబాద్ విద్యార్థులు ప్రదర్శించిన ‘నైన్ మోర్ వేస్ టూ స్క్రూ ది కాలేజ్ ఇంటర్వ్యూ’. ఇయాన్ మోక్వెతీ రాసిన ‘14 మోర్ వేస్ టు స్క్రూ ది కాలేజీ ఇంటర్వ్యూ’నే విద్యార్థులు ఇలా మలిచారు.
పన్నెండు పాత్రలున్న ఈ నాటకం కాలేజీ లైఫ్‌స్టైల్‌కు దగ్గరగా ఉంటుంది. కాలేజీలో చేర్చుకోవడానికి అవకాశం ఉన్న చివరి విద్యార్థిని ఎంపిక చేయాల్సిందిగా ఇద్దరు ఫ్యాకల్టీలకు చెబుతాడు డీన్. ఇక అక్కడి నుంచి కథనం రసవత్తరంగా సాగుతుంది. ఇంటర్వ్యూకి వచ్చే విద్యార్థులు, ఫ్యాకల్టీల మధ్య సంభాషణలు, వారి క్రేజీ ప్రవర్తన, మాట్లాడే తీరు నవ్వులు చిందించాయి. మధ్య మధ్యలో ఓ దొంగ, తొంభై ఏళ్ల వృద్ధురాలి పంచ్‌లు అదనం. కాలేజీ అంటే క్లాషెస్, ఇగోస్ వంటివి సహజం.
అన్నింటినీ దాటి కోఆర్డినేట్ చేసుకోగలిగితేనే పర్ఫెక్ట్ ప్రొడక్ట్ వస్తుంది. మేం ప్రదర్శించిన నాటకాల అనుభవం ద్వారా ఈ విషయం తెలిసింది... అంటాడు ఈ ప్లే దర్శకుడు, ఐఎంటీ విద్యార్థి భూపేంద్ర. మొత్తానికి అంతా ఎంజాయ్ చేస్తూ, కమిట్మెంట్తో చేశామన్నాడు. రంగస్థలం గురించి ఓనమాలు ఇక్కడే నేర్చుకున్నామని, కలసి చేయడం వల్ల పెద్దగా కష్టం అనిపించలేదంటాడతడు. ఉపమన్యూ, రిథిమా, రుచిర్, అభిలాషి, రవితేజ, అంకిత్, అర్షదీప్, అంగద్, గోపిక, అనిరుధ్, ధృవ్, కౌశల్ తమ పాత్రలను అద్భుతంగా పోషించి మెప్పించారు.
- ఓ మధు