మేయర్‌ను కాల్చి చంపిన భార్య
లాస్ ఏంజిల్స్: లాస్ఏంజిల్స్ కౌంటీలోని బెల్ గార్డెన్స్ మేయర్ డానియేల్ క్రెస్పో(45) పై ఆయన భార్య లీవెట్టి (43) తుపాకీతో విచక్షణరహితంగా కాల్పులు జరిపింది. దీంతో ఆయన రక్తపు మడుగులో కుప్పకూలిపోయాడు. ఆయన్ని ఆసుపత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యంలో మేయర్ డానియేల్ క్రెస్పో మృతి చెందాడని పోలీసులు వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం ... డానియేల్ క్రెస్పో ఆయన భార్య లీవెట్టి మధ్య నిన్న బెడ్ రూమ్‌లో స్వల్ప వివాదం చోటు చేసుకుంది.
అది కాస్త తీవ్రరూపం దాల్చడంతో వారి 19 ఏళ్ల కుమారుడు వారిని విడదీసేందుకు ప్రయత్నించాడు. ఆ క్రమంలో లీవెట్టి ఆగ్రహాం కట్టలు తెంచుకుంది. పక్కనే ఉన్న తుపాకీ తీసి భర్తపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపింది. దీంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోయిడు. ఈ ఘర్షణలో వీరి కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడని... అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని చెప్పారు. క్రెస్పో భార్య లీవెట్టిని అదుపులోకి తీసుకుని... ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
క్రెస్పో చదువుతున్న పాఠశాలలో లీవెట్టి చదువుతుండేది. ఆమెను తొలిసారి చూసి క్రెస్పో మనసు పారేసుకున్నాడు. 1986లో వారిద్దరు వివాహం చేసుకున్నారు. 2001లో క్రెస్పో సిటీ కౌన్సిల్‌కు ఎన్నికయాడు. అలాగే దశబ్దం పాటు లాస్ ఏంజిల్స్ కౌంటీ ప్రోబిషన్ అధికారిగా విధులు నిర్వర్తించారు. గత ఏడాదే బెల్ గార్డెన్స్ మేయర్‌గా పదవి చేపట్టాడు.