ప్రతిక్షణం ఉత్కంఠే!
ప్రతిక్షణం ఉత్కంఠే!
అధికార పక్షం దిగ్భ్రమ
విజయగర్వంతో విపక్షం
న్యూఢిల్లీ: జన్ లోక్‌పాల్‌బిల్లు బిల్లు సభ ఆమోదం పొందనట్లయితే రాజీనామా చేస్తానని ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ గురువారం ప్రకటించిన నేపథ్యంలో శుక్రవారం ఉదయం నుంచే రాజకీయాలు క్షణక్షణం ఉత్కంఠభరితంగా సాగా యి. జన్‌లోక్‌పాల్ బిల్లు విషయంలో రాజీపడబోమంటూ మంత్రి మనీష్ సిసోడియా ట్వీట్ చేయడం, కేజ్రీవాల్ దానిని రీ ట్వీట్ చేయడంతో ఉదయం నుంచే రసవత్తర రాజకీయం మొదలైంది. రాజ్యాంగబద్ధంగా ప్రవేశపెట్టనట్లయితే బిల్లుకు తాను మద్దతు ఇవ్వబోనని జేడీయూ సభ్యుడు షోయబ్ ఇక్బాల్ స్పష్టం చేశారు. ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టడంపై ఆప్ శాసనసభ్యుల మధ్య విభేదాలొచ్చాయంటూ వదంతులు వెల్లువెత్తాయి. ఈ బిల్లును ప్రవేశపెట్టడంలో చట్టబద్ధమైన ప్రక్రియను పాటించాలని ఆప్ ఎమ్మెల్యే అశోక్ అగర్వాల్ కోరినట్లు కూడా సమాచారం. ఇంతలోనే లెఫ్టినెంట్ గవర్నర్ లేఖ బాంబు బద్దలైంది. జన్‌లోక్‌పాల్ బిల్లుకు ప్రభుత్వం తన అనుమతి తీసుకోలేదని, నియమాలను పాటించలేదని, అందువల్ల దానిని సభలో ప్రవేశపెట్టడానికి అనుమతించరాదంటూ స్పీకర్‌కు లెఫ్టినెంట్ గవర్నర్ లేఖ రాసినట్లు వెల్లైడైంది. సభలో బిల్లును ప్రవేశపెట్టడానికి ముందు ప్రభుత్వం తన అనుమతి తీసుకోలేదని, అందువల్ల ఈ బిల్లును పరిగణనకు తీసుకోరాదంటూ స్పీకర్ ఎం.ఎస్. ధీర్‌కు....ఎల్జీ లేఖ రాశారు.
’రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ ప్రవేశపెట్టే జన్‌లోక్‌పాల్ బిల్లుకు తాము మద్దతు ఇవ్వబోమని బీజే పీ, కాంగ్రెస్ పార్టీలు స్పష్టం చేశాయి. ఈ బిల్లు విషయంలో ప్రభుత్వం సీరియస్‌గా లేదని డీపీసీసీ అధ్యక్షుడు అర్విందర్ సింగ్ లవ్లీ, బీజేపీ నేత హర్షవర్ధన్ ఆరోపించారు. ఈ బిల్లును తన అనుమతి లేకుండా అసెంబ్లీలో ప్రవేశపెట్టరాదని ఎల్జీ... స్పీకర్‌కు ఓ లేఖ రాసినట్లు తెలియడంతో ముఖ్యమంత్రి కేజ్రీవాల్, మంత్రి మనీష్ సిసోడియాలు ఆయనను కలిశారు. ఇదిలాఉంచితే ఈబిల్లు రాజ్యాంగబద్ధమేనని మనీష్ సిసోడియా ప్రకటించారు. మధ్యాహ్నం 2 గంటలకు సభ సమావేశమైన తర్వాత ఎల్జీ లేఖను చదివి వినిపించాలంటూ విపక్షసభ్యులు డిమాండ్ చేశారు. వెసులుబాటుకు అనుగుణంగా లేఖ చదువుతానంటూ స్పీకర్ చెప్పిన మాటలను సభ్యులు పట్టించుకోలేదు. వెంటనే ఆ లేఖను చదివి వినిపించాలంటూ సభ్యులు కోరారు. గందరగోళ పరిస్థితుల మధ్య స్పీకర్ సభను 20 నిమిషాలపాటు వాయిదావేశారు. 20 నిమిషాల తరువాత సభ తిరిగి సమావేశమవ గానే స్పీకర్ లెఫ్టినెంట్ గవర్నర్ లేఖను స్పీకర్ చదివి వినిపించారు. కాగా తన అనుమతి లేని బిల్లును సభ పరిగణించరాదని, సభలో ప్రవేశపెట్టడానికి ముందు తన లేఖను అందరికీ చదివి వినిపించాలంటూ ఆదేశించాలని ఎల్జీ ఆ లేఖలో పేర్కొన్నారు. దీంతో బిల్లును సభలో ప్రవేశపెట్టడంపై ఓటింగ్ జరిపించాలంటూ ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. బిల్లును సభలో ప్రవేశపెట్టడంపై చర్చ జరపాలని మంత్రి మనీష్ సిసోడియా చెప్పారు. ఓటింగ్ గురించి లెఫ్టినెంట్ గవర్నర్ పేర్కొనలేదని, బిల్లును ప్రవేశపెట్టడానికి ముందు సభకు తన లేఖను చదివి వినిపించాలని మాత్రమే ఎల్జీ పేర్కొన్నారని కేజ్రీవాల్ అన్నారు. ఓటింగ్‌కు డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష సభ్యుల డిమాండ్ల మధ్య ఈ బిల్లును ప్రవేశపెట్టడానికి స్పీకర్ అనుమతిం చడం, కేజ్రీవాల్ దానిని ప్రవేశపెట్టడం, బిల్లును సభలో ప్రవేశపెట్టారని స్పీకర్ ప్రకటించడం వెంట వెంటనే జరిగిపోవడంతో అధికార పార్టీ సభ్యులు ఆనందంలో, ప్రతిపక్షసభ్యులు దిగ్భ్రమలో మునిగి పోయారు. గందరగోళం మధ్య స్పీకర్ సభను అరగంట పాటు వాయిదా వేశారు. ఇదిలాఉంచితే అసెంబ్లీలో ఈ బిల్లును ప్రవేశపెట్టడం చరిత్రాత్మకమని, ఇది తమ విజయమని ఆప్ నేతలు, మంత్రులు పేర్కొనగా, ఎల్జీ ఆదేశానికి భిన్నంగా బిల్లును ప్రవేశపెట్టడం రాజ్యాంగ విరుద్ధమని
మిగతా 8వ పేజీలో ఠ
ఠ7వ పేజీ తరువాయి
ప్రతి పక్ష పార్టీలు ఆరోపించాయి. స్పీకర్ పక్షపాత ధోరణితో, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని వారు ఆరోపించారు. బిల్లును అసలు ప్రవేశపెట్టలేదంటూ వాదించారు. సభ ప్రారంభమైన తర్వాత ఎల్జీ ఆదేశాన్ని పక్కనపెట్టి బిల్లు ప్రవేశపెట్టిన తీరును కాంగ్రెస్, బీజెపీ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో బిల్లు ప్రవేశపెట్టారా? లేదా ? అనే దానిపై ఓటింగ్ జరిపించారు. బిల్లు ప్రవేశపెట్టారనే దానికి 27, ప్రవేశపెట్టలేదనే దానికి 42 ఓట్లు లభించాయి. 32 మంది బీజేపీ సభ్యులు, ఎనిమిది మంది కాంగ్రెస్ సభ్యులు, ఓ జేడీయూ సభ్యుడితోపాటు మరో స్వతంత్ర శాసనసభ్యుడు ప్రభుత్వ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటువేశారు. దీంతో సభలో బిల్లును ప్రవేశపెట్టలేదంటూ స్పీకర్ ధీర్ లాంఛనంగా ప్రకటించారు.