లయోలా అకాడమీ హవా
జింఖానా, న్యూస్‌లైన్: ఫాదర్ బాలయ్య స్మారక ఆలిండియా ఇంటర్ కాలేజి బాస్కెట్‌బాల్ టోర్నీలో లయోలా అకాడమీ జట్టు 59-25తో జమాల్ మహ్మద్ (తిరుచ్చి) జట్టుపై గెలుపొందింది. లయోలా కాలేజిలో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో లయోలా అకాడమీ ఆటగాళ్లు బాషా (17), ఉదయ్ (14), గణేశ్ (12) రాణించారు.
దీంతో అతి తక్కువ సమయంలోనే లయోలా అకాడమీ 18 పాయింట్ల ఆధిక్యంలో నిలిచింది. మరోవైపు జమాల్ మహ్మద్ క్రీడాకారులు ప్రత్యర్థిని ఎదుర్కొనేందుకు చేసిన ప్రయత్నాలన్నీ వృథా అయ్యాయి. మ్యాచ్ అఖరి నిమిషం వరకు తమ జోరును కొనసాగించిన లయోలా ఆటగాళ్లు జట్టును 34 పాయింట్ల ఆధిక్యంలో నిలిపారు.
మరో మ్యాచ్‌లో లయోలా (చెన్నై) 81-57తో ఎన్సీ లా కాలేజి (నాందేడ్)పై గెలిచింది. ఆట ప్రారంభం నుంచి ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. నువ్వానేనా అన్నట్లు సాగిన ఈ మ్యాచ్‌లో ఒక దశలో లయోలా 49-43తో ముందంజలో ఉంది. అనంతరం లయోలా జట్టులో ముకుంద్ (23), ఆంటో (17) చక్కని ఆట తీరును ప్రదర్శించి జట్టుకు విజయాన్ని అందించారు. ఎన్సీ లా కాలేజి క్రీడాకారుల్లో రంజిత్ (14), అమల్ (10) రాణించారు.
ఇతర మ్యాచ్‌ల స్కోర్లు:
ఏవీ కాలేజి (హైదరాబాద్): 69 (శామ్ 19, విజయ్ 12, సాయి 14); ఆర్జేజే (ముంబై): 57 (ప్రఫుల్ 15, అకాంక్ష్ 10).