భూకంపమే.. అయినా భయం వద్దు
మర్పల్లి, న్యూస్‌లైన్: మర్పల్లి మండల పరిధిలోని దామస్తాపూర్‌లో ఆదివారం సంభవించింది భూ ప్రకంపనలు కాదని, భూ కంపమేనని ఎన్జీఆర్ఐ సీనియర్ శాస్త్రవేత్తలు నిర్ధారించారు. అయితే ఈ భూకంపం వల్ల పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదని వారు గ్రామస్తులకు అభయమిచ్చారు. గత కొద్దిరోజులుగా గ్రామంలో భూప్రకంపనలు, భారీ శబ్దాలు రావడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే అధికారుల సూచన మేరకు సోమవారం ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు డాక్టర్ ఆర్కే చందా, డాక్టర్ శ్రీ నాగేష్‌లు దామస్తాపూర్‌ను సందర్శించారు.
భూప్రకంపనలపై గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో మూడు నెలలుగా భూమి నుంచి బ్లాస్టింగ్ మాదిరిగా శబ్దాలు వస్తున్నాయని సర్పంచ్ స్వరూప యాదవరెడ్డి, మాజీ సర్పంచ్ పాండురంగారెడ్డి శాస్త్రవేత్తలకు వివరించారు.గత మంగళవారం రాత్రి భారీగా శబ్దం రావటంతో ఇళ్ల నుంచి ప్రజలు వీధుల్లోకి పరుగులు తీశారని, ఆదివారం మధ్యాహ్నం 1.37 నిమిషాలకు భారీ శబ్దం రావటంతో గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారని చెప్పారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త డాక్టర్ చందా మాట్లాడుతూ ఆదివారం మధ్యాహ్నం 1.37 గంటలకు వచ్చిన భూ ప్రకంపనం ఒక్కటి తమ కార్యాలయంలో నమోదైందన్నారు. గతంలో కిలారి, నాందేడ్ వంటి ప్రాంతాల్లో వచ్చిన భూకంప తీవ్రతకంటే ఆదివారం జరిగిన తీవ్రత తక్కువ ఉన్నందున ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు.
గ్రామంలో ఆదివారం వచ్చిన భూకంప తీవ్రత ఒకటిగా నమోదుకావటంతో ప్రజలు భయపడాల్సిన అవసరం లేదుని శాస్త్రవేత్త డాక్టర్ శ్రీ నాగేష్ పేర్కొన్నారు. ఇక ముందు గ్రామంలో ప్రజలు కొంత కాలం పాటు.. వీలైనంతవరకు తేలిక పాటి ఇళ్లలో (సిమెంట్ రేకుల ఇళ్లు) ఉండాలన్నారు. ఇకముందు ఏవిధంగా ప్రకంపనలు వస్తున్నాయి అనే విషయాలను పసిగట్టే పరికరాలను గ్రామంలో ఏర్పాటు చేస్తామన్నారు. పరికరం పసిగట్టిన వివరాలను అధ్యయనం చేసి నివేదికను జిల్లా జాయింట్ కలెక్టర్‌కు అందజేస్తామన్నారు. భూమి 10 సెకండ్ల కంటే తక్కువ సమయం కంపిస్తే ఎలాంటి ప్రమాదం ఉందదన్నారు.
పరిశోధన పరికరాలు అమర్చాం: డాక్టర్ ఆర్కే చందా
దామస్తాపూర్‌లో భూప్రకంపనల తీరుతెన్నులను తెలుసుకునేందుకు ఇక్కడ ప్రత్యేక పరికరాలను ఏర్పాటు చేసినట్లు ఎన్జీఆర్ఐ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఆర్.కే చందా తెలిపారు. స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో పరికరాలు అమర్చిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక పరికరాలను ఒక వారం రోజులపాటు గ్రామంలోనే ఉంచుతామన్నారు. తద్వారా ప్రకంపనల తీవ్రత నమోదవుతుందన్నారు. పరిశోధన పరికరాలు ఏర్పాటు చేసిన ప్రాంతంలో ఎలాంటి భారీ శబ్ధాలు చేయవద్దన్నారు. భూమిలోని శబ్ధతరంగాల తీవ్రత స్పష్టంగా తెలియాలంటే పరికరాలు అమర్చిన ప్రాంతంలో ప్రజలు కాస్త నిశ్శబ్ధ వాతావరణం కల్పించాలని సూచించారు.