డీయూ ద్రావణంతో పేనుబంక పరారీ!
దున్నింగ, ఊడుగ ద్రావణంతో సత్ఫలితాలు
కరువు కాటకాలను తట్టుకొని, వ్యయ ప్రయాసలకోర్చి సాగు చేస్తున్న వివిధ పైర్లను పూత, కాత దశలో పచ్చ పురుగు, దాసరి పురుగు, పేనుబంక ఆశిస్తూ తీవ్ర నష్టం కలిగిస్తుంటాయి. అయితే, సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో కషాయాలు, ద్రావణాలతో ఆ చీడపీడలకు చక్కని పరిష్కారాలు వెదుకుతున్నారు అభ్యుదయ రైతు కొమ్ములూరి విజయకుమార్ (98496 48498). వైఎస్సార్ జిల్లా వేంపల్లె మండలం టి వెలంవారిపల్లె ఆయన స్వగ్రామం. కరువు కాలంలోనూ మెట్ట ప్రాంతాల్లో అందుబాటులో ఉండే చెట్ల ఆకులతో రైతులు సులువుగా తయారు చేసుకోగలిగిన ద్రావణాలు, కషాయాలపై ఆయన దృష్టి కేంద్రీకరించారు. కొత్తగా తయారు చేసే ద్రావణాలనుతన పంటలపై వాడిన తర్వాత ఆ జ్ఞానాన్ని ఇతరులకు పంచుతున్నారు.
పచ్చ పురుగు, దాసరి పురుగు, పేనుబంకలను సమూలంగా నాశనం చేసే దున్నింగ, ఊడుగ ద్రావణాన్ని(డీయూ ద్రావణం) ఇటీవల తయారు చేశారు. తన పొలంలో వాడి మంచి ఫలితాన్ని రాబట్టారు. ఆహార పంటలు, కూరగాయ పంటలు, పండ్ల తోటలు, వాణిజ్య పంటలపై దీన్ని పిచికారీ చేయవచ్చని విజయకుమార్ చెబుతున్నారు. ఈ ద్రావణం పురుగుల గుడ్లు పగలకుండా చేసి లార్వా దశలోనే పురుగుల జీవన చక్రం నిలిచిపోయేలా చేస్తుందన్నారు.
డీయూ ద్రావణం తయారీ ఇలా...
తెల్ల లేదా ఎర్ర దున్నింగ, ఊడుగ ఆకులతో డీయూ ద్రావణాన్ని తయారు చేస్తారు. దున్నింగాకును ఆయుర్వేద మందుల తయారీలో వాడతారు. ఊడుగ ఆకుల కషాయాన్ని పాము, తేలు విషానికి విరుగుడుగా వాడతారు. బీడు భూములు, చెరువు గట్ల మీద ఈ మొక్కలు విరివిగా లభిస్తాయి. 10 కిలోల దున్నింగాకు (లేత కొమ్మలు, వేళ్లు సహా).. 10 కిలోల ఊడుగ చెట్టు ఆకులు, లేత కొమ్మలను సేకరించి మెత్తగా నూరి పెట్టుకోవాలి. ఈ ముద్దలను 200 లీటర్ల ప్లాస్టిక్ డ్రమ్ములో వేసి నిండుగా నీరు పోయాలి. ప్రతి రోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కర్రతో బాగా కలియబెట్టాలి. ఇలా 20 రోజుల పాటు పులియబెట్టాక డీయూ ద్రావణం వాడకానికి సిద్ధమవుతుంది. ఇది 3 నెలల పాటు నిల్వ ఉంటుంది. తయారీ దశ నుంచి వాడుకునే వరకు దీన్ని నీడలోనే ఉంచాలి.
ఏ యే పంటపై ఎలా వాడాలి?
పచ్చపురుగు, దాసరి పురుగు, పేనుబంక ఆశించకముందే డీయూ ద్రావణాన్ని పిచికారీ చేసి పంటలను పూర్తిగా రక్షించుకోవచ్చని విజయకుమార్ తెలిపారు. వరిపై పురుగు లార్వా దశలో ఉంటే 20 లీటర్ల నీటికి అర లీటరు ద్రావణం కలిపి పిచికారీ చేయాలి. రెక్కల పురుగు దశలో అయితే 1 లీటరు ద్రావణం, పురుగు దశలో అయితే ఒకటిన్నర లీటర్ల ద్రావణం చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. పండ్ల తోటలు, కూరగాయలు, పత్తి, మిరప వంటి ఇతర పంటల్లోనూ ఇదే మోతాదులో పిచికారీ చేసుకోవాలి. ఆకుకూర తోటలపై అయితే ఆయా దశల్లో పురుగు తీవ్రతను బట్టి పావు లీటరు/ అర లీటరు/ లీటరు ద్రావణాన్ని 20 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఆకుకూరల లేత మొక్కలను కొరికి తినే మిడతలను సైతం ఈ ద్రావణం నివారిస్తుందన్నారు. నారును ఈ ద్రావణంలో ముంచి నాట్లు వేసుకుంటే వైరస్ తెగుళ్లు దరిచేరవన్నారు.
- మాచుపల్లె ప్రభాకరరెడ్డి, కడప అగ్రికల్చర్