అయ్యో.. పళ్ళు విరిగిపోయాయా?
స్వప్నలిపి
ఉన్నట్టుండి...ఠక్కున మెలకువ వస్తుంది.
చేతులు నోరును తడుముతాయి.
‘‘హమ్మయ్యా...పళ్ళకేమీ కాలేదు’’ అనుకుంటాం. భయపెట్టిన కలను గుర్తుకు తెచ్చుకుంటాం.
కలలో..
మైసూర్పాక్ కొరకగానే... ముందు పళ్ళు విరిగిపోతాయి.
ఏదో జోక్ విని గట్టిగా నవ్వుతుంటాం...ఆ శబ్దానికే పళ్ళు విరిగిపోతాయి. పొద్దున పళ్ళు తోముకుంటున్నప్పుడు... ఒకటి తరువాత ఒకటి పళ్ళు విరిగిపోతుంటాయి. మైసూర్పాక్ కొరికితే, బ్రష్ చేస్తే...పళ్ళు విరగడమేమిటి? ఇలాంటి వింత కలలను గుర్తు తెచ్చుకున్నప్పుడు తెగ నవ్వొస్తుంది. అంతమాత్రాన ఆ కల తీసిపారేయదగిన కల కాదు. దానిలో రహస్య భయం ఉంది. అదేమిటో తెలుసుకుందాం... తలలో ఒక తెల్లవెంట్రుక కనిపించినా కొందరు ఆందోళన పడిపోతారు. ‘వయసు మీద పడుతోంది’ అనే భయం వారిని అంతర్గతంగా పీడిస్తుంటుంది.
‘చూడడానికి నేను అందంగా ఉంటాను. వయసు మీద పడితే నా అందం సంగతి ఏమిటి? కొంతకాలానికి పళ్ళు ఉండవు, బోసి నోరు, మోకాళ్ల నొప్పులు..’ ఇలా ఏవేవో ఊహిస్తూ చేసే ఆలోచనలే కలల రూపంలో వస్తాయి. వయసు గురించిన భయాలను ప్రతిబింబించే కల ఇది.