మతీన్ కూడా స్వలింగసంపర్కుడే!
- మతీన్ ఫోన్లో ‘గే యాప్’ ఉందన్న ఎఫ్‌బీఐ
- చాలాసార్లు క్లబ్‌కు వచ్చాడన్న ‘పల్స్’
న్యూయార్క్: ఆర్లెండో కాల్పులకు పాల్పడిన ఉగ్రవాది మతీన్‌కు సంబంధించి రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. నిన్నటి వరకు స్వలింగ సంపర్కులంటే(గే) నచ్చకే.. ఉగ్రవాద ఆలోచనలతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని భావిస్తుండగా.. తాజా విచారణలో మతీన్ కూడా గే అని తేలింది. అతను గే అయి ఉండొచ్చని.. కోపం, సిగ్గు కారణంగా ఈ వాస్తవాన్ని దాచిపెట్టి ఉంటాడని మతీన్ మాజీ భార్య సితోరా యుసుఫ్రీ వెల్లడించారు. 2008లో ఆన్లైన్లో కలుసుకున్నామని.. 2009లో వివాహంచేసుకున్నామని అప్పుడే తనకు క్లబ్‌లకు వెళ్లే అలవాటున్న విషయాన్ని మతీన్ చెప్పడన్నారు. అయితే అవి గే క్లబ్‌లా కాదా అని మాత్రం చెప్పలేదన్నారు.
ఎఫ్‌బీఐ ప్రాథమిక విచారణలోనూ మతీన్ ‘గే యాప్స్’ను వినియోగించేవాడని తెలిసింది. 2013లో తోటి ఉద్యోగులతో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు, 2014లో సిరియాలో ఆత్మాహుతి దాడికి పాల్పడిన మొహ్మద్ అబుసల్హాతో సంబంధాలున్నాయనే కారణంతో రెండుసార్లు విచారించినట్లు ఎఫ్‌బీఐ వెల్లడించింది. అల్ కాయిదా, హిజ్బుల్లా సంస్థలతో తనకు సంబంధాలున్నట్లు పలుమార్లు సన్నిహితులతో చెప్పాడని ఎఫ్‌బీఐ డెరైక్టర్ జేమ్స్ కోమీ తెలిపారు. మరోవైపు, ఆదివారం నాటి దురదృష్టకర సంఘటనకు సాక్షంగా నిలిచిన పల్స్ క్లబ్ నిర్వాహకులు కూడా మతీన్ చాలాసార్లు తమ క్లబ్‌కు వచ్చాడని వెల్లడించారు. కొన్ని సార్లు క్లబ్లో ఓ మూలన కూర్చుని తాగి వెళ్లేవాడని.. మరికొన్నిసార్లు తాగి గట్టిగా అరుస్తూ రచ్చ చేసేవాడన్నారు. ఈ క్లబ్‌కు వచ్చేవారు కూడా మతీన్‌ను చాలాసార్లు కలిసినట్లు తెలస్తోంది.
ఆర్లెండోను సందర్శించనున్న ఒబామా
మలీన్ కాల్పుల్లో చనిపోయిన 49 మంది పల్స్క్లబ్ మృతులకు అమెరికా అధ్యక్షుడు ఒబామా గురువారం నివాళులర్పించనున్నారు.
సాధ్యమైన కారణాల అన్వేషణ
ఆర్లెండో ఘటనకు సాధ్యమైన కారణాలను ఎఫ్‌బీఐ అన్వేషిస్తోంది. అమెరికన్ ముస్లిం అయిన మతీన్ స్వదేశీ ప్రేరేపిత ఉగ్రవాద ఉన్మాదేనని.. ఇతనికి ఐసిస్, ఇతర ఉగ్రవాద సంస్థలతో సంబంధాల్లేవని శ్వేతసౌధం, ఎఫ్‌బీఐ సంయుక్తంగా వెల్లడించాయి. ఇతని మానసిక స్థితి సరిగా లేదని మాజీ భార్య చెప్పటంపైనా, స్వలింగ సంపర్కులకు వ్యతిరేకమన్న కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది. లైంగిక ప్రవృత్తిపై ఎటూ తేల్చుకోలేక పోవటం కూడా ఈ ఘటనకు కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. ఆర్లెండో కాల్పలును ఐక్యరాజ్యసమితి భద్రతామండలి ఖండించింది. లైంగిక ధోరణి ఆధారంగా వ్యక్తులపై కాల్పులకు దిగటం దారుణమంది.