భర్త కోసం వివాహిత మౌనపోరాటం
మల్లాపురం (యాదగిరిగుట్ట)
అదనపు కట్నం తేలేదని.. తనను వదిలించుకోవాలని చూస్తున్న భర్తకు కనువిప్పు కలిగించి.. తనకు న్యాయం చేయాలని కోరుతూ ఓ వివాహిత అత్తారింటి ఎదుట మౌనపోరాటానికి పూనుకుంది. ఈ ఘటన యాదగిరిగుట్ట మండలం మల్లాపురంలో సోమవారరం చోటు చేసుకుంది. బాధితురాలు, తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్లాపురానికి చెందిన అక్కినపల్లి వరస్వామి–రాములమ్మ దంపతుల పెద్దకుమారుడు రాజుచారికి మెదక్ జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన పానుగంటి చక్రపాణి–వెంకటమ్మల రెండవ కూతురు సంధ్యారాణికి నాలుగేళ్ల (10–03–2012) క్రితం వివాహం జరిగింది. మొదటి రెండేళ్లు వీరి సంసార జీవితం సాఫీగానే సాగినా అనంతరం అదనపు కట్నం ఆ కుటుంబంలో చిచ్చురేపింది. వివాహ సమయంలో పుట్టింటి వారు పెట్టిన బంగారు ఆభరణాలను తన అత్త, భర్త అమ్ముకుని చిత్రహింసలు పెట్టారని వాపోయింది. పలుమార్లు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీలు జరిగినా వారి తీరులో మార్పు రాలేదని ఆవేదనచెందింది. కట్నం తేవాలని పుట్టింటికి పంపి ఇప్పుడు విడాకులు కావాలని లాయర్‌తో నోటీసులు పంపించారని తెలిపింది. దీంతో గత్యంతరం లేక మౌనపోరాటానికి పూనుకున్నట్టు వివరించింది. తనకు న్యాయం జరగకుంటే ఆత్మహత్య చేసుకునేందుకు కూడా వెనుకాడడని కిరోసిన్ డబ్బాను చూపించింది. ఈ విషయంలో గ్రామస్తులు సంధ్యారాణికి మద్దతుగా నిలిచారు.