రూ.300కోట్లు,300కేజీల గోల్డ్, గన్స్ ఏమైనట్లు?
ఆలయంలోని కాళికాదేవి విగ్రహం కింద పెద్ద గొయ్యి. అందులో రూ.300 కోట్ల నగదు, 300 కేజీల బంగారం, నాలుగు ఏకే 47 తుపాకులు. భారీ నిధి కావటంతో దానిని స్వాధీనం చేసుకోవటానికి ఆర్మీ రంగంలోకి దిగింది. అధికారులు గర్భగుడిలోకివెళ్లి కాళీ విగ్రహాన్ని పక్కకు జరిపారు. అందరూ షాక్. అక్కడ నిధిలేదు. ఆర్మీ వస్తోందన్న సమాచారంతో ఎవరో నిధిని మాయం చేశారు.
ఈ సంఘటన అసోం రాజధాని డిస్ పూర్ లో 2014, జూన్ 1న జరిగింది. అంతకు కొద్దిరోజుల ముందే ఆ ఆలయ ధర్మకర్త, అతని భార్య దారుణ హత్యకు గురయ్యారు. హత్యలపై కేసు నమోదయిందికానీ, నిధిని ఎవరు దొంగిలించారనే విషయాన్ని స్థానిక పోలీసులు పట్టించుకోలేదు. ఒక ఆర్మీ ఇంటెలిజెన్స్ మాజీ అధికారి మాత్రం ఏదో తేడా జరుగుతోందని అనుమానించాడు. దొంగతనం జరిగిన కొద్ది సేపటికే అక్కడికి చేరుకుని కొన్ని ఆధారాలను సేకరించి, వాటిని సుప్రీంకోర్టుకు సమర్పిస్తూ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలుచేశాడు.
300 కోట్ల రూపాయలు, 300 కేజీల బంగారం, నాలుగు తుపాకులు.. ఇంత భారీ మొత్తాన్ని అంత ఈజీగా కొల్లగొట్టడాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిన్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం గర్హించింది. టెంపుల్ ట్రెజర్ రాబరీపై సమగ్ర విచారణకు ఆదేశిస్తున్నట్లు మూడురోజుల కిందట ఉత్తర్వులు ఇచ్చింది. ఇంటెలిజెన్స్ మాజీ అధికారి మనోజ్ కుమార్ కౌశల్ కథనం ప్రకారం ఈ మిస్టరీ వెనుక అతిభారీ కుట్రలు దాగున్నాయి. ఈ ఉదంతం అసలెలా మొదలైందంటే..
తేయాకు తోటలకు ప్రసిద్ధిగాంచిన అసోం అనేక తీవ్రవాద సంస్థలకు నెలవు. జాతుల మధ్య వైరంగా ప్రారంభమైన తగాదా చివరికి దేశవ్యతిరేక కార్యకలాపాల వరకు వెళ్లింది. ఉల్ఫా, ఎన్ డీఎఫ్ బీ లాంటి సంస్థలు ఆ రాష్ట్రంలో చేసిన విధ్వంసం అంతాయింతాకాదు. ఈ తీవ్రవాద సంస్థలకు ప్రధాన ఆదాయ వనరు టీ తోటల యజమానులు. రకరకాలుగా యజమానులను బెదిరించి తీవ్రవాదులు డబ్బువసూలు చేస్తారు. డిస్ పూర్ లోని ఓ టీతోట యజమాని మృదుల్ భట్టాచార్య.. అసోం టీ గార్డెజ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా. తీవ్రవాదుల ఆదేశాల మేరకు భట్టాచార్య భారీ నగదు, బంగారం, తుపాకులను సేకరించి ఆయన టీతోటలోని కాళీ మాత ఆలయంలో దాచాడు. అయితే డబ్బు పోగేసిన రెండుమూడు రోజులకే ఆయనను, ఆయన భారను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు.
దుండగులు టీతోటలోని ఆలయం బయటి నుంచి సొరంగం నిధిని ఎత్తుకుపోయినట్లు ఆర్మీ మాజీ అధికారి కౌశల్ చెబుతున్నారు. దొంగతం జరిగిన రెండు రోజుల తర్వాత కొందరు వ్యక్తుల బ్యాంకు ఖాతాల్లో భారీగా నగదు జమఅయిందని, వారంతా హత్యకు గురైన భట్టాచార్య సన్నిహితులేనని, ఈ మేరకు రహస్యంగా సేకరించిన 11 బ్యాంక్ అకౌంట్ల వివరాలు కోర్టుకు సమర్పించినట్లు ఆయన పేర్కొన్నారు. కౌశల్ అందించిన ఆధారాలన్నీ సహేతుకమని కోర్టులో తేలేదాకా టెంపుల్ ట్రజరీ రాబరీ మిస్టరీనే!