వానర వీరంగం
మారెంపల్లి (గుమ్మఘట్ట) : మారెంపల్లిలో ఓ వానరం వీరంగం సృష్టిస్తోంది. పాఠశాల సమీపంలో తిరుగుతూ విద్యార్థులపై దాడులకు తెగబడుతోందని సర్పంచ్ జి.లక్ష్మిదేవి తెలిపారు. మధ్యాహ్న భోజనం తయారు చేస్తున్న ఏజెన్సీ నిర్వాహకురాలు జయమ్మ చేతికి కరవడంతో మూడు కుట్లు పడ్డాయి. అంగన్వాడీ కేంద్రానికి వెళ్లే చిన్నారి యువరాజుపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచింది. ఇలా ఇప్పటి వరకు 20 మంది కోతి దాడిలో గాయపడ్డారు. తలపైకి ఎగిరి కూర్చుంటుందని, ఆ సమయంలో కదలకుండా ఉంటే ఏమీ అనదని, కదిలితే కరుస్తోందని బాధితులు చెబుతున్నారు. అటవీ అధికారులు స్పందించి తక్షణం గ్రామంలోంచి ఆ కోతిని బంధించి తీసుకెళ్లాలని సర్పంచ్‌తోపాటు గ్రామస్తులు కోరుతున్నారు.