Mayor Saidai Duraisamy
-
అమ్మ కోసం ఆస్తులిచ్చేస్తా!
సాక్షి ప్రతినిధి, చెన్నై: ముఖ్యమంత్రి జయలలిత పేరున ప్రజలకు సేవలందించేందుకు అవసరమైతే తన ఆస్తులు మొత్తాన్ని దానం చేస్తానని చెన్నై కార్పొరేషన్ మేయర్ సైదై దురైస్వామి ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని స్థానిక సంస్థలకు వచ్చేనెల 24వ తేదీలోగా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో చెన్నై కార్పొరేషన్ తుది సమావేశం గురువారం ప్రారంభమై శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ అమ్మ ఉచిత కల్యాణ మండపాలు వివాహాలు, నామకరణ మహోత్సవాలు తదితర అనేక శుభకార్యాలతో పేదలకు చేరువయ్యాయని తెలిపారు. గత పదేళ్ల కాలంలో మొత్తం 65వేల శుభకార్యాలు ఆయా మండపాల్లో చోటుచేసుకున్నాయని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ ఏ ఉద్దేశంతోనైతే రాజకీయాల్లోకి తీసుకువచ్చారో దానిని మనస్సులో ఉంచుకుని ప్రజాసేవ చేస్తున్నానని అన్నారు. అలాగే అమ్మ దయవల్ల చెన్నై కార్పొరేషన్ మేయర్‌గా ఎన్నికైనానని చెప్పారు. తన మనిదనేయ ట్రస్ట్‌లో విద్యన భ్యసించిన ఎందరో విద్యార్థులు ఉన్నత విద్యావంతులై ఈరోజు కార్పొరేషన్లో తన కింద పనిచేస్తున్నందుకు ఆనందంగా ఉందని తెలిపారు. ఇలాంటి మంచి అవకాశం కేవలం అమ్మ వల్లనే తనకు కలిగిందని చెప్పారు. అమ్మ తనను మేయర్‌ను చేయకుంటే ప్రజల సేవల చేసే భాగ్యం కలిగి ఉండేది కాదని అన్నారు. ఇలా ఒకటిని మించి ఒకటిగా తనకు మేలు చేసిన అమ్మ కోసం తన యావదాస్తిని దానం చేసేందుకు సిద్ధమని పేర్కొన్నారు. ఈ జన్మలోనే కాదు జన్మ జన్మలకు అమ్మకు రుణపడి ఉంటానని తెలిపారు. రాష్ట్రంలో అమ్మ ప్రవేశపెట్టిన పథకాలను పేరు పేరునా ప్రస్తావించారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ అధికారులకు, కౌన్సిలర్లకు కృతజ్ఞతలు తెలిపారు. విపక్షాల వాకౌట్: కార్పొరేషన్ తుది సమావేశంలో డీఎంకే, కాంగ్రెస్, డీఎండీకే, వీసీకే పార్టీలకు చెందిన కౌన్సిలర్లు పాల్గొనగా మేయర్ సైదై దొరస్వామి ఆద్యంతం ముఖ్యమంత్రి జయలలితను ప్రస్తుతించడంతోనే సరిపెట్టడంపై విపక్షాలను విమర్శలు గుప్పించారు. అసెంబ్లీలో 110వ విధి కింద ప్రకటించిన పథకాలను వరుసగా పేర్కొంటూ జయలలితపై పొగడ్తల వర్షం కురిపిస్తుండగా ప్రతిపక్ష నేత సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలో విపక్ష సభ్యులంతా లేచి నిలబడి నిరసన నినాదాలు చేశారు. మేయర్ తన ప్రసంగంలో డీఎంకే అధ్యక్షులు కరుణానిధిపై విమర్శలు చేయడాన్ని నిరసిస్తూ వాకౌట్ చేశారు. -
సైదై రాజీనామా?
చెన్నై, సాక్షి ప్రతినిధి: చెన్నై కార్పొరేషన్ మేయర్ సైదై దొరస్వామి తన పదవికి రాజీనామా చేశారంటూ వదంతులు శనివారం నగరంలో హల్చల్ చేశాయి. అన్ని పార్టీల్లోనూ కలకలం రేపింది. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే విజయం సాధించిన తరువాత అదే పార్టీ కార్పొరేషన్‌ను కూడా కైవశం చేసుకుంది. దీంతో అధికార పార్టీకి చెందిన సైదై దొరస్వామి మేయర్‌గా మారారు. పార్టీ అధినేత్రి జయలలితకు నమ్మకమైన అనుచరునిగా ముద్ర వేయించుకున్నారు. మేయర్ హోదాలో ప్రతిపక్ష డీఎంకేపై ఆయన తరచూ విరుచుకుపడేవారు. డీఎంకే హయాంలో మేయర్‌గా ఉండిన స్టాలిన్, ఎం సుబ్రమణ్యంలపై అనేక సార్లు విమర్శనాస్త్రాలు సంధించడంతో కార్పొరేషన్ సమావేశాలు రసాభాసగా మారేవి. రెండు రోజుల క్రితం జరిగిన కార్పొరేషన్ సమావేశంలో వారిద్దరిపై మరికొన్ని విమర్శలు చేశారు. దీంతో డీఎంకే కౌన్సిలర్లు ప్రతిదాడికి దిగారు. కీళ్రాజ్ మంగళంలో 10 ఎకరాల విస్తీర్ణంలో మేయర్ సైదై విలాసవంతమైన ఫాంహౌస్ నిర్మించుకున్నారని ఆరోపణలు గుప్పించారు. పార్టీ కార్యక్రమాలపై నిషేధం అన్నాడీఎంకే పార్టీ కార్యక్రమాల్లో మేయర్ హాజరుపై నిషేధం విధించినట్లు తెలుస్తోంది. పార్టీ కార్యక్రమాలకు సైదైను పిలువకూడదని, హాజరైన వారు సైతం ఆయన పేరును ప్రస్తావించరాదని, పార్టీ పోస్టర్లలో ఎక్కడా సైదై బొమ్మ పెట్టడానికి లేదనే నిర్ణయాలు జరిగినట్లు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీ నేతలకు, కౌన్సిలర్లకు సైతం ఈ నిర్ణయాలను చేరవేసినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో సైదై చెన్నై నగరాన్ని దేశ స్థాయిలో ప్రముఖ సిటీగా ఇండియా టుడే గుర్తించగా, ఈ అవార్డును అందుకునేందుకు మేయర్ సైదై ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. మేయర్ ఊరిలో లేని సమయంలో ఆయనపై నిషేధాజ్ఞలు, రాజీనామా వార్తలు అన్నాడీఎంకే పార్టీలో తీవ్రచర్చకు దారితీశాయి. ఇది నిజమా, కాదా అని నిర్ధారించేందుకు ఎవరూ సాహించ లేదు. కొందరు వ్యక్తులు, మీడియా ప్రతినిధులు ఢిల్లీకి ఫోన్ చేసి మేయర్‌నే ప్రశ్నించగా ఆయన మౌనం పాటించారు. దీంతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో మరింత అయోమయం నెలకొంది.