సైదై రాజీనామా? | Saidai Duraisamy resigned as Chennai Mayor Post | Sakshi
Sakshi News home page

సైదై రాజీనామా?

Published Sun, Nov 23 2014 2:52 AM | Last Updated on Sat, Sep 2 2017 4:56 PM

సైదై రాజీనామా?

సైదై రాజీనామా?

 చెన్నై, సాక్షి ప్రతినిధి: చెన్నై కార్పొరేషన్ మేయర్ సైదై దొరస్వామి తన పదవికి రాజీనామా చేశారంటూ వదంతులు శనివారం నగరంలో హల్‌చల్ చేశాయి. అన్ని పార్టీల్లోనూ కలకలం రేపింది. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే విజయం సాధించిన తరువాత అదే పార్టీ కార్పొరేషన్‌ను కూడా కైవశం చేసుకుంది. దీంతో అధికార పార్టీకి చెందిన సైదై దొరస్వామి మేయర్‌గా మారారు. పార్టీ అధినేత్రి జయలలితకు నమ్మకమైన అనుచరునిగా ముద్ర వేయించుకున్నారు. మేయర్ హోదాలో ప్రతిపక్ష డీఎంకేపై ఆయన తరచూ విరుచుకుపడేవారు. డీఎంకే హయాంలో మేయర్‌గా ఉండిన స్టాలిన్, ఎం సుబ్రమణ్యంలపై అనేక సార్లు విమర్శనాస్త్రాలు సంధించడంతో కార్పొరేషన్ సమావేశాలు రసాభాసగా మారేవి. రెండు రోజుల క్రితం జరిగిన కార్పొరేషన్ సమావేశంలో వారిద్దరిపై మరికొన్ని విమర్శలు చేశారు. దీంతో డీఎంకే కౌన్సిలర్లు ప్రతిదాడికి దిగారు. కీళ్‌రాజ్ మంగళంలో 10 ఎకరాల విస్తీర్ణంలో మేయర్ సైదై విలాసవంతమైన ఫాంహౌస్ నిర్మించుకున్నారని ఆరోపణలు గుప్పించారు.
 
 పార్టీ కార్యక్రమాలపై నిషేధం
 అన్నాడీఎంకే పార్టీ కార్యక్రమాల్లో మేయర్ హాజరుపై నిషేధం విధించినట్లు తెలుస్తోంది. పార్టీ కార్యక్రమాలకు సైదైను పిలువకూడదని, హాజరైన వారు సైతం ఆయన పేరును ప్రస్తావించరాదని, పార్టీ పోస్టర్లలో ఎక్కడా సైదై బొమ్మ పెట్టడానికి లేదనే నిర్ణయాలు జరిగినట్లు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీ నేతలకు, కౌన్సిలర్లకు సైతం ఈ నిర్ణయాలను చేరవేసినట్లు తెలుస్తోంది.
 
 ఢిల్లీలో సైదై
 చెన్నై నగరాన్ని దేశ స్థాయిలో ప్రముఖ సిటీగా ఇండియా టుడే గుర్తించగా, ఈ అవార్డును అందుకునేందుకు మేయర్ సైదై ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. మేయర్ ఊరిలో లేని సమయంలో ఆయనపై నిషేధాజ్ఞలు, రాజీనామా వార్తలు అన్నాడీఎంకే పార్టీలో తీవ్రచర్చకు దారితీశాయి. ఇది నిజమా, కాదా అని నిర్ధారించేందుకు ఎవరూ సాహించ లేదు. కొందరు వ్యక్తులు, మీడియా ప్రతినిధులు ఢిల్లీకి ఫోన్ చేసి మేయర్‌నే ప్రశ్నించగా ఆయన మౌనం పాటించారు. దీంతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో మరింత అయోమయం నెలకొంది.  
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement