రాష్ట్రంలో హై అలర్ట్
సాక్షి, హైదరాబాద్: ముంబై వరుస బాంబు పేలుళ్ల నిందితుడు యాకూబ్ మెమన్ ఉరితీత నేపథ్యంలో కేంద్రం ఆదేశాల మేరకు రాష్ట్రంలో పోలీసు విభాగం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు హై అలర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, బస్స్టేషన్లకు వచ్చిపోయే వారిని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. షాపింగ్‌మాల్స్, సినిమాహాళ్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. అలాగే కొన్ని సున్నితమైన ప్రాంతాలపై ఇంటలిజెన్స్ వర్గాలు నిఘాను మరింత తీవ్రతరం చేశాయి. కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రంలోని పోలీసులకు సెలవులను సైతం రద్దు చేశారు.
ఆన్‌లైన్‌పై నిఘా..
మరో పదిహేను రోజుల్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఉన్నందున భద్రతకు పోలీసులు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆన్లైన్ సైట్లు, సోషల్ మీడియా వెబ్సైట్లతో పాటు ఇంటర్నెట్ సెంటర్లపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. సైట్లను అనుక్షణం పర్యవేక్షించడం కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. రెచ్చగొట్టే వాఖ్యలు చేసినా, ఏ చిన్న అనుమానం వచ్చినా వెంటనే ఆ పోస్టుకు సంబంధించిన వ్యక్తులను అదుపులోకి తీసుకునేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.